నిధుల లెక్క తేల్చాలి
- కేంద్రం నుంచి రూ. 2,293 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల
- లక్ష్యాలకు విరుద్ధంగా ఖర్చు చేశారు
- కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి లలన్ సింగ్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా ఆర్థి సంఘం నిధులను ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి పనులకు వాటిని ఖర్చు చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లిస్తున్న తీరుపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌కు ఆదివారం లేఖ రాశారు.
కరెంట్ బిల్లులు, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలకు, కాంట్రాక్టర్ల పాత బకాయిలను కూడా ఈ నిధుల నుంచే చెల్లిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243 జీ అధికరణం, 11వ షెడ్యూల్, 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఇది విరుద్ధమని స్పష్టం చేశారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం రూ. 2,293.74 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసిందని, మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వడం లేదని, ఆర్థిక సంఘం నిధులు కూడా దారి మళ్లించాలని సర్పంచులపైన రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని, ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపించాలని కోరారు.
నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్దేశిత లక్ష్యాలకే ఆర్థిక సంఘం నిధులు వినియోగించేలా ఆదేశాలివ్వాలని, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






