20 July, 2026 | 8:39 PM

ఈ వర్షాభావ పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలి

20-07-2026 01:47 AM

సీపీఐ మండల కార్యదర్శి ఉదయ్ 

దామరచర్ల,జులై 19 : ఎల్ నినో ప్రభావం తో కౌలు రైతులు కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉన్నందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దామరచర్ల కేంద్రంలో సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడటం వల్ల  కరువు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.

ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పంటలు వేయకపోతే రైతులు కౌలు రైతులు కార్మికులు పేద ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా నష్టపోతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రకృతి విపత్తుల శాఖ నుండి తక్షణమే పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉపాధి కల్పనకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను దొడ్డిదారిన మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఆపి దేశంలో ఉన్న పేద రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రైవేటు పెట్టబడుదారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం పంటలు అత్యల్పంగా ఉండే సూచన ఉన్న నేపథ్యంలో పేద ప్రజలను రైతులను కార్మికులను కౌలు రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి ధనావత్ శాంత , గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, సిపిఐ సీనియర్ నాయకులు గజ్జల లక్ష్మీ నరసింహారెడ్డి, జమ్ముల కోటయ్య , శుద్ధ బోయిన రాములు , భాగం శేషయ్య , చక్రి , రమేష్ తదితరులు ఉన్నారు.