18 March, 2026 | 3:33 AM

ఎమ్మెల్యే సామెల్ ఇంటిపై బీజేపీ వర్గీయుల దాడి అమానుషం

18-03-2026 12:12 AM

మిర్యాల సర్పంచ్ అనంతుల శ్రీనివాస్

నూతనకల్, మార్చి 17 : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసంపై బీజేపీ వర్గీయులు జరిపిన దాడి అత్యంత అవాంఛనీయమని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ముసుగులో భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయడం ద్వారా భయాందోళనలు సృష్టించాలని చూడటం మూర్ఖత్వమే అవుతుందన్నారు.

సిద్ధాంత పరమైన పోరాటాలు ఉండాలి తప్ప, ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజానికి మంచిది కాదన్నారు. దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలను, వారి వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.ప్రజాప్రతినిధులకు తగిన రక్షణ కల్పించి, నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాలని,నికృష్టమైన ఈ దాడికి ఆ పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో గుణగంటి వెంకన్న,కనకటి పల్ల వెంకన్న,నాయిని సోమన్న,చలిగంటి శ్రీశైలం,అనంతుల శ్రీధర్,జాల మహేష్, ఇరుగు మల్లయ్య,స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే సామెల్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఎమ్మెల్యే సామేలు ఇంటిపై దాడి హేయం : సర్పంచ్ కృష్ణ నాయక్ 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి17: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని సూర్యానాయక్ తండ సర్పంచ్ లూనావత్ కృష్ణ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే కావడం వల్ల బీజేపీ, బీజేవైఎం నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి ఇంటిపై దాడులు జరగడం దురదృష్టకరమని ఈ దాడి ఒక వ్యక్తిపై కాకుండా ప్రజాస్వామ్య విలువలపై,దళిత సమాజ గౌరవంపై జరిగిన దాడి అని అన్నారు.ఈ ఘటనకు కారకులైన మనువాద భావజాలంతో ఉన్న అరాచక శక్తులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.