సకల శుభాల శ్రావణమాసం!
గురువారంతో ప్రారంభమయ్యే శ్రావణ మాసంతోనే మన దేశంలో వర్షరుతువు మొదలవుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ప్రత్యేకం. ఈ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఆకాశంలో కలిగే మార్పులను, ప్రకృతిలో చోటుచేసుకునే పరిణామాలను సమతుల్యం చేయడానికి అనువైన మాసం శ్రావణం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం, చంద్రుని కారణంగా తలెత్తే దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించే దిశగా ధర్మాచరణను పండుగగా ఆచరించే క్రమంలోనే శ్రావణ మాస నియమం ఏర్పడింది.
ఈ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించాలంటూ నియమబద్ధం చేయడం శ్రావణం పట్ల మహర్షుల ముఖ్య ఉద్దేశంగా చెప్పాలి. శ్రావణం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే, శనివారాల్లో వేంకటేశ్వరస్వామిని పూజించి, ఉపవాసాలు ఉంటారు. తిథుల విషయానికి వస్తే.. విదియ రోజు అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవికి పూజలు చేయడం కొన్నిచోట్ల కనిపిస్తుంది. పంచమి రోజు నాగుల పంచమిగా నాగమయ్యను పూజిస్తారు. శ్రావణపౌర్ణమి రోజు రాఖీ వేడుకలు జరుగుతాయి. శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమిని జన్మాష్టమిగా వేడుకలు జరు పుకొంటారు.
వీటితో పాటు నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వా దశి, వరాహ జయంతి.. ఇలా ఎన్నో పండుగల సమాహారంగా శ్రావణం నెల రోజులూ పండుగశోభ కనిపిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు బ్రహ్మచారులు, గృహస్తులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీకగా భావించే యజ్ఞోపవీత ధారణతో జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం ఉంటుందని వేదోక్తి. ఇదే రోజు విష్ణుమూర్తి వేదాలను రక్షించడానికి హయగ్రీవుడిగా అవతరించడంతో శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకొంటారు.
ఆ స్వామిని ఉపాసన చేస్తే ఏకాగ్రత, బుద్ధికుశలత, జ్ఞానం, ఉన్నత చదువు ప్రాప్తిస్తాయని ప్రతీతి. శ్రవణం వల్ల అంటే వినడం ద్వారా నేర్చుకోవలసినది వేదం. ఈ మాసాన్ని వేదాధ్యయన కాలంగా భావించి.. శ్రావణ పౌర్ణమి మరుసటిరోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. కొత్తగా ఉపనయనం అయిన వారికి జంధ్యాల పౌర్ణమి రోజు మౌంజీ బంధనం తొలగిస్తారు. ఈ మాసంలో వేద గ్రంథాల ముద్రణకు సహకరించినా, వేద విద్యార్థులకు గ్రంథాలు దానం చేసినా శ్రీమహావిష్ణువు సంతసిస్తారని పెద్దలు చెబుతారు.
శ్రావణమాసం రైతుల మాసంగా చెప్పాలి. శ్రావణ బహుళ అమావాస్య రోజున పొలాల అమావాస్యగా గ్రామాల్లో రైతులు పశువులను అలంకరించి పూజలు చేస్తారు. వర్షాకాలం చేపల వంటి జలచరాల సంతా నోత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది కాబట్టి ఈ మాసాన్ని ప్రేమమాసంగా పిలుస్తారు. సకలదేవతా వ్రతాలకు శుభసమయం శ్రావణం. తమ ఇల్లు సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని శ్రీమహాలక్ష్మిని, మంగళగౌరి అమ్మవారిని పూజిస్తారు. ‘పురుషానాం అయం మాసః శ్రావణం పరికీర్తితః’ అని పురాణోక్తి. అంటే ఈ మాసం పురుషులకు కూడా ప్రత్యేకమైనదే.
స్కాంధపురాణ అంతర్గతమైన శ్రావణమాస వైభవంలో మొత్తం ౩౦ వ్రతాలు ఆచరించాలని మహర్షులు చెప్పారు. ఇదే నెలలో దేవుడి కోసం కూడా ఒక వ్రతం చేస్తారు. అదే పవిత్రోత్సవం. శ్రావణ మాసం ప్రతీ రోజూ భక్తి శ్రద్ధలతో, ఉపవాసదీక్షలతో కొనసాగుతుంది. ఈ సమ యంలో చేసే ఉపవాసాలు, ఉపాసనలు, వ్రతాలు మనిషి జీవన ప్రమా ణాలను క్రమబద్ధీకరించి ఆ యురారోగ్యాలను పెంచే శాస్త్రీయతను కలిగి ఉంటాయి. అటు ఆధ్యా త్మికంగా, ఇటు శాస్త్రీయంగా సకల ఫలాలనిచ్చే మాసమే శ్రావణం.
కామిడి సతీష్‌రెడ్డి






