కార్పొరేట్ రుణాల రైటాఫ్
దేశాభివృద్ధి, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉపాధి కల్పన పేరిట బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు రుణాలు పొందుతున్న కార్పొరేట్ సంస్థలు వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత పన్నెండేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ సుమారు పది లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించడం గమనార్హం. కాగా, ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, తక్కువ ధరలకే భూములను కూడా అప్పనంగా పొందుతున్న కార్పొరేట్లు రుణాలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం శోచనీయం. మరోవైపు రుణాల రికవరీ విషయంలో బ్యాంకులు, ప్రభుత్వాల వ్యవహారశైలిపైనా విమర్శలు వస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, చిరువ్యా పారులు, విద్యార్థులు, చిరుద్యోగుల నుంచి ముక్కపిండి మరీ రుణాలను వసూలు చేసే బ్యాంకులు, ప్రభుత్వాలు కార్పొరేట్లను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం.
కాగా, మొదట మొండిబకాయిలుగా మారుతున్న కార్పొరేట్ రుణాలు చివరికి రైటాఫ్ రూపాన్ని సంతరించుకోవడం మన దేశంలో షరా మామూలైపోయింది. అయితే, రైటాఫ్ చేయడమంటే రుణాల రద్దు కాదని ఇటు పాలకులు, అటు బ్యాంకర్లు బుకాయించడం మరో వైచిత్రి. రుణాల రైటాఫ్, అధికారికంగా రుణమాఫీ చేయడం సాంకేతికంగా ఒక్కటే కాకపోవచ్చు. కానీ, మన దేశంలో రైటాఫ్ చేసిన రుణాన్ని తిరిగి వసూలు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. భారీ మొండిబకాయిల కారణంగా బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం దెబ్బతింటున్నది. దీనివల్ల కొత్త పరిశ్రమలు, చిరు వ్యాపారాలు, రైతులు, విద్యార్థులు, ఇతర సంస్థలకు రుణాలివ్వడం కష్టంగా మారుతున్నది.
మరోవైపు బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు కొండలా పేరుకుపోతుండటంతో దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. తత్ఫలితంగా బ్యాంకులను ఆదుకోవడానికి ప్రజాధనాన్ని ప్రభుత్వం మూలధనంగా సమకూర్చాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ భారం అంతిమంగా ప్రరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రజల పైనే పడుతున్నదని చెప్పక తప్పదు. కార్పొరేట్ రుణాలు దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్న నేపథ్యంలో పారదర్శకతతో పాటు సమర్థవంతమైన వసూళ్లు అత్యవసరం.






