13-08-2025 01:06:17 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణాలపై విజయక్రాంతిలో వరుసగా ప్రత్యేక స్టోరీలు ప్రచురితం అయ్యాయి.
దీంతో స్థానికులు ప్రభుత్వ భూ మి కబ్జాపై జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పసుమామూలో ప్రభుత్వ భూముల ఆక్రమణ నిర్మాణాలపై తమకు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పసుమాముల సర్వే నెంబర్ 386లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
ఇక్కడ కబ్జాలో ఉన్నవ్యక్తి ఓ మున్సిపల్ కమిషనర్ కొడుకు అని తెలుసుకుని.. ఆయనకు 5958 జీవో కింది ఎలా రెగ్యులర్ చేశారనే కోణంలో రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ చేసిన సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించారని అన్ని కోణాల్లో అరా తీస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీ నేత మున్సిపల్ ఆఫీసు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన షెటర్లను సైతం వారు పరిశీలించినట్లు తెలుస్తుంది.
గతంలో సైతం అక్రమ షెటర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తికి స్థానికంగా ఎవ్వరు అండగా ఉన్నారనే అంశం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదే విధంగా విజిలెన్స్ అధికారులు పసుమాముల గ్రామంలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పుడు ఇదే అంశం మున్సిపాలిటీలో తీవ్ర చర్చ నియాంశంగా మారగా..... అక్రమార్కుల్లో అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అని ఆందోళన మొదలైంది.