14-08-2025 08:32:40 AM
చెరువుగట్టు వద్ద చేపలకు గాలం వేస్తున్న సామాన్యులతో మాట ముచ్చట.
తాను గాలం విసిరి చేపలు పడుతూ.. సందడి.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): సామాన్య ప్రజలతో మమేకం అవుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కొత్త పంతాను ఎంచుకున్నారు. రాష్ట్ర మంత్రి అంటేనే హంగు ఆర్భాటలు రొండంచెల పోలీసుల బందోబస్తు, భద్రత నడుమ హంగామా సృష్టించే పద్ధతి నుంచి తాను ఒక సామాన్య వ్యక్తుల మాదిరి స్థానిక ప్రజలతో మమేకం అవుతూ తన ప్రవర్తనలో చాలా మార్పులు తెచ్చుకున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా తనను గుర్తించాలని పదేపదే వేదికలపై చెప్తూ అదేవిధంగా తన ప్రవర్తన కూడా మార్చుకుంటూ కనిపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఉయ్యాలవాడ వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థత, ఆందోళనకు గురవుతున్న క్షణాల్లో వారికి సినిమా పాటలు వినిపిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతూ స్ఫూర్తిని రగిలించే పాటలు వినిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
మంగళవారం కొల్లాపూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో అనారోగ్యంతో బాధపడుతూ తల్లిదండ్రుల కోసం రోదిస్తున్న ఓ విద్యార్థిని ఆప్యాయంగా పలకరించి సామాన్య వ్యక్తి లాగా చిన్నారి ముందే మోకరిల్లి కూర్చుని విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు. బుధవారం నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు వద్ద గాలం వేస్తూ చేపలు పడుతున్న సామాన్యుల వద్ద చేరి తాను గాలం వేసి చేపలు పడుతూ, వల విసిరి వారితో కలిసి పోయారు. వారితో కాసేపు ముచ్చటించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు.