15 June, 2026 | 3:03 AM

బీజేపీది ఓట్ చోరీ పాలసీ

15-06-2026 01:50 AM
  1. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్ల తొలగింపు
  2. సర్ పేరుతోనూ అదే పని 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని, అప్రజాస్వామికంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ విమర్శించారు. సర్ పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి కాంగ్రెస్ పార్టీ, దేశంలోని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను చోరీ చేసి దొంగతనంగా రాజకీయాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆదివారం సర్‌పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ నిర్వహించింది.

పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులకు సర్‌పై దిశానిర్దేశం చేశారు. ఓటర్ మ్యాపింగ్, సర్ జరిగే విధానం.. బీఎల్‌ఏలు చేయాల్సిన పనులు, బీఎల్‌ఓ చేస్తున్న పనులపై దృష్టిసారించాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ జరిగింది, మిగతా ఓటర్ మ్యాపింగ్‌లో ఓట్ కోల్పోయిన వారిని గుర్తించి వారికి తిరిగి ఓట్ హక్కు కల్పించే అంశాలపై వివరించారు. ఓటును తొలగిస్తే వెంటనే తగిన ఆధారాలతో వాటిని తిరిగి దరఖాస్తు చేయించి పునరుద్ధరణ జరిగేలా చూడాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 90 శాతం బీఎల్‌ఏ ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని వారికి నేతలు వివరించారు. ఇక నుంచి క్షేత్ర స్థాయిలో  25వ తేదీ నుండి ఇంటింటికి బీఎల్‌ఏలు వెళ్తారని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాజేశ్ పేర్కొన్నారు. ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ని నియామకం చేస్తూ, ప్రతి అసెంబ్లీకి ఒక కోఆర్డినేటర్‌ని నియమించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.