ఆ బాలుడికి అత్యుత్తమ వైద్యం అందించాలి
- ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడొద్దు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- కుక్కల దాడి ఘటనపై ఆరా తీసిన సీఎం
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): హయత్ నగర్ పరిధిలో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం సీఎంవో, జీహెఎంసీ అధికారులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుడికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్య చికిత్స విషయంలో ఖర్చుకు వెనుకాడొద్దని, బాలుడు త్వరగా కోలుకునేలా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా, జీహెచ్‌ఎంసీ అధికారులు స్వయంగా బాలుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారి బాగోగులు చూసుకుంటూ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సూచించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
కుక్కల నివారణపై స్పెషల్ డ్రైవ్
సీఎం ఆదేశాల నేపథ్యంలో జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హుటాహుటిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అద నపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి వకీల్‌తో సమావేశమై.. బాలుడికి అందుతున్న వైద్యం పై చర్చించారు.
ఈ సందర్భంగా నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల బెడద లేకుండా ఇప్పటికే చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను మరింత ముమ్మరం చేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.




