ప్రారంభమైన లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
మంగపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామం శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం అశేష భక్త జన సందోహం నడుమ ఆడంబరంగా ప్రారంభమయ్యాయి.
ఏప్రిల్ 27 నుండి మే 6వ తేది వరకు పది రోజుల పాటు జరగనున్న లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో సోమవారం విష్వక్సేన పూజ, భగవత్ పుణ్యహవాచన, రక్షాభంధనం, రుత్విక్ వరణం, ఉత్సవ మూర్తులకు స్నపనం (ఉత్సవాంగ స్నపనం), ఆళ్వార్ల తిరుమంజనం, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






