భవనం శిథిలం.. భయం భయం!
- ఒకప్పుడు కళకళలాడిన బడి.. నేడు శిథిలావస్థ
- పెచ్చులూడుతున్న పాఠశాల, అంగన్వాడి పైకప్పులు
- అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
గంభీరావుపేట, జులై 13(విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో అమలు లోపంతో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన బడులు నేడు వెలవెలబోతున్నాయి. భవనాల దుస్థితి కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడానికే వెనుకాడుతున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని బరిగేలగూడెం ప్రాథమిక పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతింది. పైకప్పు పెచ్చులూడి, వర్షాకాలంలో గోడలు, స్లాబ్ల నుంచి నీరు జొరబడుతోంది. సుమారు 35 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉండటంతో వినియోగానికి పనికిరావడం లేదు. వంటగది కూలిపోవడంతో తరగతి గదినే మధ్యాహ్న భోజనం వండేందుకు ఉపయోగిస్తున్నారు. అదే ప్రాంగణంలోని అంగన్వాడి భవనం కూడా ప్రమాదకర స్థితిలో ఉండటంతో చిన్నారులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టి, కొత్త భవనాలు నిర్మించాలని వారు కోరుతున్నారు.
కొత్త భవనాలు నిర్మించాలి
ఒకప్పుడు మా బడి విద్యార్థులతో కళకళలాడేది. ఇప్పుడు భవనాలు శిథిలమైపోవడంతో పిల్లలను పంపడానికే భయంగా ఉంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలి
శనిగరపు నరేష్ వర్మ, స్థానికుడు
పాఠశాల అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను,పరిస్థితులను పరిశీలించడం జరిగింది. భవనాల దయనీయ స్థితి, మౌలిక వసతుల లోపాలపై సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు చేయించే దిశగా కృషి చేస్తాము. అలాగే కాలనీ వాసుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపడతాము.
సర్పంచ్ మల్లు గారి పద్మ, గంభీరావుపేట






