11-01-2026 12:48:08 AM
* ‘ఒక తండ్రి తన ఆరేండ్ల కుమారుడి స్కూల్ బ్యాగ్‌తోపాటు టిఫిన్‌ను తూకం వేశాడు. తరువాత ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. పుస్తకాల బ్యాగు, టిఫిన్ కలిపి సుమారు 4.5 కిలోగ్రాములుగా తేలింది. వాస్తవానికి పిల్లల శరీర బరువులో 10 శాతం మాత్రమే పుస్తకాల బ్యాగు బరువు ఉండాలనే సిఫారసుతో పోల్చితే.. పరిమితికి రెండింతలకుపైగా ఉండటంతో.. ఆన్‌లైన్‌లో తల్లిదండ్రుల తీవ్ర ఆందోళనకు, ఆగ్రహానికి దారితీసింది.’
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): భారతదేశం అంతటా చిన్న పిల్లలు మోస్తున్న భారీ స్కూల్ బ్యాగుల మోత మరోసారి తీవ్రమైన ఆందోళనకు కేంద్రబిందువుగా మారింది. పసివెన్నులపై.. మోపు తున్న పుస్తకాల భారం.. సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాఠాలు మొదలుకాకముందే తరగతి గదులు కూడా తెలియ కుండానే విద్యార్థులకు హాని చేస్తున్నాయా అనే ప్రశ్నను తల్లిదండ్రులు, వైద్యులు, విద్యావేత్తలు లేవనెత్తుతున్నారు.
ఈ తాజా చర్చకు కారణం మహారాష్ర్టలోని ఒక తండ్రి తన కుమారుడి బ్యాగు బరువును తూచి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మొదలయ్యింది. ఈ ఘటనతో పిల్లల శారీరక ఆరోగ్యంపై చాలా కాలం నుంచి ఉన్న ఆందోళనలు మరోసారి పెల్లుబికాయి. దేశంలోని అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పుడు సాధారణంగా మారిన బ్యాక్‌ప్యాక్‌లు తల్లిదండ్రుల కండ్లముందు ‘భారంగా’ కదలాడుతున్నాయి.
అవసరం లేకపోయినా అనేక అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, నీటి బాటిళ్లు, లంచ్ బాక్స్‌లతోపాటు కొన్నిసార్లు క్రీడా సామగ్రి కూడా ప్రతిరోజూ మోసుకెళ్లాల్సి వస్తోంది. చాలా పాఠశాలలు ఇప్పటికీ కఠినమైన షెడ్యూళ్లను అనుసరిస్తూ వెళుతున్నారేగానీ.. టైంటేబుల్‌ను ఈ షెడ్యూళ్లతో సమన్వయం చేయలేకపోతున్నారని, కనీసం తేలికైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పిల్లల ఎదుగుదలపై పెనుమార్పులు
పసిపిల్లల భుజాలపై వేలాడే పుస్తకాల భారం.. కేవలం అసౌకర్యం మాత్రమే కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకా లం ఈ పుస్తకాల బ్యాగ్ భారాన్ని మోయడం వల్ల శరీర భంగిమలో అసమతుల్యత, వెన్నెముకపై ఒత్తిడి, వెన్నునొప్పితోపాటు ప్రారం భ దశలోనే కండరాలు, --ఎముకలకు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ము ఖ్యంగా ఎముకలు ఇంకా అభివృద్ధి చెందుతున్న పిల్లల్లో.. అలసట, ఏకాగ్రత తగ్గిపో వడం, పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి తగ్గడం వంటి పరోక్ష ప్రభావాలుంటాయ ని కూడా కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
ఎన్‌సీపీసీఆర్ రూల్స్ అమలు లోపం
దేశంలో ఇప్పటికే ఈ సమస్యపై పలు మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)తోపాటు పలు రాష్ట్రాల విద్యాశాఖ లు, స్కూల్ బ్యాగుల బరువుపై పరిమితులు విధించాలని, విడతల వారీగా టైంటేబుల్‌ను అమలు చేయాలని పలుమార్లు సిఫారసు చేశాయి. అయినప్పటికీ, ఈ మార్గదర్శకాలు అమలు చేయడంలో లోపం కనపడుతోంది.
చాలా సందర్భా ల్లో ఈ బాధ్యతను పాఠశాలలకే వదిలివేస్తున్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్‌కే లక్ష్మణ్ చేసిన కఠినమైన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. భారత విద్యావ్యవస్థపై వ్యాఖ్యానిస్తూ, పిల్లలు “వ్యవస్థ భారా న్ని తమ వెన్నుపై మోస్తున్నట్లుగా కనిపిస్తున్నారు” అని ఆయన ఒకసారి వ్యాఖ్యానిం చారు. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన ఆ వ్యాఖ్యలు.. నేటి తల్లిదండ్రుల ఆందోళనలకు అద్దం పడుతున్నాయి.
శారీరక భారంగా మారుతున్న పాఠ్యభారం
పసిపిల్లల వెన్నెముకలపై పుస్తకాల మోత సమస్య మన ఆలోచనా ధోరణుల ప్రభావంగానే తలెత్తినట్టు విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ పుస్తకాలతోనే మెరుగైన చదువు సాధ్యమనే ఒక భావన ఉంది. ఈ ‘పాఠ్యభారం నేరుగా శారీరక భారంగా మారుతోంది” అని ఒక సీనియర్ విద్యావేత్త విశ్లేషిస్తున్నారు.
డిజిటల్ పాఠ్యపుస్తకాలు, లాకర్ సదుపాయాలు, వారంలో వివిధ పాఠ్యాంశాలను రొటేషన్‌గా మార్చడం, పరిమితంగా హోంవర్క్ వంటి పరిష్కారాలు సూచిస్తున్నప్పటికీ.. అవి అమలవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతోంది. మళ్లీ మన చిన్నారులు భారమైన బ్యాగులతో ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కండ్లముందు కనపడుతున్న వేళ.. విద్య భారం కావాలా?.. లేక తల్లిదండ్రులు భయపడుతున్నట్లుగా లేలేత భుజాలపై ఉన్న ఈ బరువు ఇక మరింత పెరగకుండా తేలిక చేయాలా? అనే ప్రశ్నే ఉదయిస్తుంది..!