17 April, 2026 | 6:08 PM

పట్నాన్ని తలపిస్తున్న మేడారం

11-01-2026 12:57 AM
    • వనం పట్నమైంది..
  • రహదారులు, సరికొత్త జంక్షన్లతో మేడారం ప్రాంతం కళకళ
  • చకచకా విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతుల పనులు
  • రాతి శిలలపై బొమ్మలు చెక్కిన 250 మంది శిల్పులు
  • శిలలపై 750 పేర్లు.. 7 వేల బొమ్మలు
  • పునర్నిర్మాణంలో వనదేవతల పూజల్లో విశిష్టత
  • 200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ
  • 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ 
  • ఈ సారి మహాజాతరకు సరికొత్త శోభ ఆహ్వానం
  • శిలాకృతుల్లో ఆదివాసి సంస్కృతికి జీవం

మేడారం, జనవరి 10 (విజయక్రాంతి): మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో మేడారం పట్టణాన్ని తలపిస్తోన్నది. రూ.101 కోట్లతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువయ్యే జాతర గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించారు. మేడారం నలువైపులా నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించారు. జంపన్న వాగులో శాశ్వత ప్రాతిపదికన పనులు చేశారు. విద్యుత్, తాగునీరు, మెరుగైన రవాణా, వసతి సౌకర్యం ఏర్పాట్లు చేశారు. జంక్షన్‌లను గిరిజన సంప్రదాయం ఉట్టిపడే విధంగా కళాకృతులు ఏర్పాటుచేసి సుందరీకరిం చారు. దీంతో ములుగు నుంచి మేడారం వరకు తాడ్వాయి, జంగాలపల్లి జంక్షన్ల వద్ద ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరు గడించి, కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి సరికొత్త మురిపం సంతరించుకుని.. భక్తజనకోటికి ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు స్వాగతం పలుకనుంది. తరలివచ్చే అశేషజనవాహనిని ఆధ్యాత్మికతతో కనువిందు చేయనుంది.

శిలలపై బొమ్మలు చెక్కిన 250 మంది శిల్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో ప్రత్యేకంగా వెలికి తీసిన గ్రానైట్ రాళ్లను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో కళాకృతులు చెక్కించారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతిలాల్ పర్యవేక్షణలో సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ మైపతి అరుణ్, 15 మంది విద్యార్థులు రాతి శిలల చిత్ర రూపకల్పనలో భాగస్వాములయ్యారు. వంశపారంపర్య పూజారులు, ఆదివాసి సంఘాల ప్రతినిధుల సమ్మతి, సూచనలు, ఆదేశాల ప్రకారం 250 మంది శిల్పులు రాతి శిలలపై బొమ్మలు చెక్కారు.

పునర్నిర్మాణంలో వనదేవతల పూజల్లో విశిష్టత

పునర్నిర్మాణంలో వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తూరి వంటి పన్నెండు రకాల చెట్లను, 140 రకాల కు చెందిన ఆయుర్వేద మొక్కలను పెంచడానికి రూపకల్పన చేశారు. సుందరంగా చెక్కించిన రాతి శిలలను భారీ క్రేన్లతో వందలాదిమంది కార్మికులు, స్తపతులు, శిల్పులు, అధికారులు, స్వయంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ నిరంతర పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. దీంతో  మేడారం గద్దెల సరికొత్త రాతిశిలా ప్రాంగణాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 

శిలలపై 750 పేర్లు.. 7 వేల బొమ్మలు

ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కారు. సమ్మక్క రాయి బంధానీ 5వ గొట్టు వంశానికి సంబంధించి ఇంటి దైవం ఒక కొమ్ము ఉండే దుప్పి, రెండువైపులా అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకల చిత్రాలను తోరణం అగ్రభాగాన చెక్కారు. ఇక మిగతా శిలలపై మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు గొట్టుల వంశానికి చెందిన చరిత్రలు, వారు పూజించిన జంతువులు జీవనశైలిని తెలిపే చిత్రాలను చెక్కారు. మొత్తంగా 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7వేల బొమ్మలు రాతి శిలలపై చెక్కించారు. తాళపత్రాల్లో లభించిన ఆధారాల ప్రకారం కోయవంశీల చరిత్రను గద్దెల ప్రాంగణం రాతి ప్రాకారాలపై చిహ్నాలను, బొమ్మలను చెక్కించారు. 

1969లో దేవాదాయ శాఖ పరిధిలోకి..

1940 వరకు పూర్తిగా ఆదివాసి గిరిజనులు మాత్రమే నిర్వహించుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. బాహ్య ప్రపంచం గుర్తింపు పొందిన తర్వాత వనదేవతలను ఇలవేల్పుగా కొలుస్తూ గిరిజనేతరులు కూడా లక్షల్లో జాతరకు తరలివచ్చారు. దీంతో 1969లో ఈ జాతరను ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చింది. అప్పటి నుంచి ప్రతి రెండేళ్ల కోమారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతరను నిర్వహిస్తోంది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. 2014లో తిరిగి తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.