calender_icon.png 3 February, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందడిగా నైమిషం ఎర్త్ ఫెస్టివల్

03-02-2026 01:19:12 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): పర్యావరణ హితమే అందరి అభిమతం కావాలని, అదే భవిష్యత్తులో మానవాళికి మేలు చేస్తుందని భిన్న రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. జె కృష్ణమూర్తి హైదరాబాద్ సెంటర్, టీమ్ రేట్రోల సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలి, ఖాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా (ఈఎస్ సిఐ) ప్రాగంణలో ఆదివారం నైమిషం ఎర్త్ ఫెస్టివల్ 2026, 3వ ఎడిషన్ నిర్వహించారు. పర్యావరణ ఉత్సవంలో 70కి పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), కళాకారులు, చేనేత కార్మికులతో పాటు పలు కమ్యూనిటీ గ్రూపులు పాలుపంచుకున్నాయి. ముఖ్య అతిథిగా యునిసెఫ్ చీఫ్ ఫీల్ ఆఫీసర్ డా జెలాలెం బి. టాఫెస్సేతో పాటు ఈఎస్సీఐ డైరెక్టర్ డా. జి.రమేశ్వర్‌రావు హాజరై మాట్లాడుతూ.. పిల్లలు, భవిష్యత్ తరాలు, పర్యావరణ సంరక్షణమానవ సంక్షేమం మధ్య ఉన్న లోతైన సంబంధాలపై ఫెస్టివల్ బలంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, నైమిశం ఎర్త్ ఫెస్టివల్ గౌరవ సలహాదారు స్వప్న సుందరి ఈ ఫెస్ట్‌లో సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ అవగాహన మధ్య ఉన్న అనుబంధా న్ని విశ్లేషించారు. లెర్నింగ్ జోన్‌లో నేయడం, సహజ రంగులతో డైయింగ్, చెరియాల్ మాస్క్ పెయింటింగ్, సీడ్బాల్ తయారీ, రాక్ స్టాకింగ్, రంగోలి, సంప్రదాయ హస్తకళల శిక్షణలో వందలాది మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేనేత, హస్తకళల జోన్‌లో సిద్దిపేట, పోచంపల్లి, నారాయణపేటతో పాటు ఇతర చేనేత, ఖాదీ క్లస్టర్ల నుంచి వచ్చిన నేతన్నలు సందర్శకులతో నేరుగా మమేకమయ్యారు. పలువురు సందర్శకులు మొక్కల ఆధారిత, చేతితో నేసిన వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలను కొనుగోలు చేయడం ద్వారా ఫెస్టివల్ సందేశాన్ని బలపరిచారు.