16 July, 2026 | 8:49 AM

లెక్క మారింది!

19-04-2024 12:30 AM

పంథా మార్చిన రైజర్స్ బాదుడే పరమావధిగా ముందుకు

‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి’ అన్న చందంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. మొన్న మొన్నటి వరకు మంచి బౌలింగ్ జట్టుగా పేరున్న రైజర్స్.. ఇప్పుడు ఆ గుర్తింపును తుడిపేసుకొని.. ప్రత్యర్థి బౌలర్లపై పంజా విసురుతోంది. గతంలో రైజర్స్ బౌలింగ్ చూసి భయపడ్డ ప్రత్యర్థులు ఇప్పుడు హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగుతోందంటే జడిసిపోతున్నారు. 

పదేండ్లుగా పదిలంగా ఉన్న అత్యధిక పరుగుల రికార్డును ఈ సీజన్‌లో బద్దలు కొట్టిన రైజర్స్.. ఇరవై రోజుల్లోపే మరోసారి తమ రికార్డును బ్రేక్ చేసింది. ముంబై బౌలర్లను ఊచకోత కోసిన మనవాళ్లు.. బెంగళూరు బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డారు. ఈ దెబ్బకు అత్యధిక సిక్సర్ల రికార్డు సైతం రైజర్స్ ఖాతాలో చేరింది. గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికి ముందే ప్రత్యర్థులను భయపెడుతున్న రైజర్స్ బ్యాటింగ్ బోల్డ్‌నెస్‌పై ప్రత్యేక కథనం.. 

ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ దళమనే పేరు సంపాదించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పంథా మార్చుకుంది. ఒకప్పుడు రైజర్స్‌తో మ్యాచ్ అంటే మన బౌలింగ్ దాడిని చూసి ప్రత్యర్థులు భయపడేవారు. బౌలర్లను ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచించుకొని బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే.. ముందు బ్యాటర్లను ఎలా అడ్డుకోవాలా అని ప్రతి జట్టు జుట్టు పీక్కుంటుంది. అవును నిజమే.. తాజా సీజన్‌లో హైదరాబాద్ జోరు చూస్తే ఈ వాఖ్యల్లో తప్పులేదనిపించడం ఖయామే. సాధారణంగా సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తే.. 140 పరుగులు చేయడమే పెద్ద గొప్ప అని గతంలో అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేయకపోతే బాగుండు అని భావిస్తున్నారు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్ మాట్లాడుతూ.. ‘సీజన్‌లో బ్రేకుల్లేని రైలులా దూసుకెళ్తున్న హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాం. వారి బ్యాటర్ల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని అన్నాడంటే.. రైజర్స్ బ్యాటింగ్ ప్రత్యర్థుల్లో ఎంతలా దడపుట్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ అందులో మూడుసార్లు అలవోకగా రెండొందల పైచిలుకు పరుగులు చేయడం విశేషం. అందులో రెండు మ్యాచ్‌ల్లో అయితే 250 మార్క్ దాటింది.

ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన సృష్టిస్తూ ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డును తమ పేరిట లిఖించుకున్న కమిన్స్ సేన.. పది రోజుల్లోనే తిరిగి ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఈ సారి బెంగళూరు బౌలర్ల భరతం పడుతూ చెలరేగిపోయింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. తాజా సీజన్‌లో హైదరాబాద్ విజయాల్లో ఏ ఒక్కరి పాత్రో ప్రధానంగా ఉందనుకుంటే పొరబాటే. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ జట్టుకు అవసరమైనప్పుడు రాణిస్తుండటంతోనే రైజర్స్ రికార్డులు బ్రేక్ చేయగలుగుతున్నది. క్లాసెన్, హెడ్, మార్క్మ్ వంటి అంతర్జాతీయ స్టార్లతో పాటు.. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు దంచికొట్టడంతోనే ఇది సాధ్యపడింది. 

క్లాసెన్ క్లాసిక్ స్టార్ట్

ఈ సీజన్‌లో హైదరాబాద్ తొలి మ్యాచ్ కోల్‌కతాతో ఆడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించగా.. నైట్‌రైడర్స్ బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. సాల్ట్ (54), రస్సెల్ (64) మెరిశారు. లక్ష్యాన్ని చూసిన విశ్లేషకులు ఇక హైదరాబాద్ పనైపోయినట్లే అనే నిర్ణయానికి వచ్చేశారు. రైజర్స్ ఇన్నింగ్స్ కూడా అందుకు తగ్గట్లే సాగింది. కానీ ఆశలే లేని స్థితిలో క్లాసెన్ రెచ్చిపోయాడు. కోల్‌కతా బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 63 పరుగులు చేసి తొలి మ్యాచ్‌తోనే ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన క్లాసెన్.. జట్టు విజయానికి 4 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఫలితం రైజర్స్‌కు అనుకూలంగా రాకపోయినా.. ఆ స్ఫూర్తి సీజన్ మొత్తం కొనసాగుతోంది. 

చిన్నస్వామిలో అరాచకం

అప్పటికే లీగ్‌లో అత్యధిక స్కోరు తమ పేరిట రాసుకున్న సన్‌రైజర్స్.. ఇరవై రోజులు తిరగకముందే దాన్ని బద్దలుకొట్టింది. ముంబై బౌలర్లను చెడుగుడాడుకున్న రైజర్స్ బ్యాట ర్లు.. బెంగళూరు బౌలర్లపై దండయాత్ర ప్రకటించారు. ఒకరిని మించి ఒకరు రెచ్చిపోవడంతో రైజర్స్ అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాలు హస్తగతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు సెంచరీ బాదితే.. క్లాసెన్ (67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మరోసారి తన సిక్సర్ల పవర్ చాటాడు. చివర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో రైజర్స్  కొండంత స్కోరు చేసింది.ఛేదనలో బెంగళూరు పోరాడినా ఫలితం లేక పోయింది. 

ఉప్పల్‌లో ఊచకోత

తొలి మ్యాచ్‌లో తృటిలో పరాజయం పాలైన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో విశ్వరూపం చూపింది. సొంతగడ్డ అయిన ఉప్పల్ స్టేడియంలో ఊహకందని విధ్వంసాన్ని సృష్టించింది. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ప్లేయర్ బాదుడే పరమావధిగా చెలరేగిపోవడంతో ముంబై బౌలర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు (277/3) నమోదు చేసుకుంది. రైజర్స్ దెబ్బతో దశాబ్దానికిపైగా బెంగళూరు పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు బద్దలైంది. మనవాళ్ల ధాటికి బుమ్రా మినహ మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

ఈ సీజన్‌లో రైజర్స్ ప్రదర్శన

కోల్‌కతా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి

ముంబైపై 31 పరుగుల తేడాతో జయభేరి

గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం

చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపు

పంజాబ్‌పై 2 పరుగుల తేడాతో జయకేతనం

బెంగళూరుపై 25 పరుగుల తేడాతో విక్టరీ