జనగణన ప్రతి పౌరుడి బాధ్యత
సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాది : కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, మే 12: జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుండి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగా మే 10 వరకు స్వీయ గణన నిర్వహించగా, మే 11 నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. జనగణన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని, ప్రజలు వారికి సహకరించాలని కోరారు. జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, రెవెన్యూ,పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు,వివిధ కళాశాలల విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, యువత పాల్గొన్నారు.






