కోలాహలంగా హనుమాన్ జయంతి
వేలాది భక్తులతో గిరిప్రదక్షిణ
హాజరైన టీటీడీ రాష్ట్ర కార్యదర్శి
భీమదేవరపల్లి, మే 12 (విజయక్రాంతి): మినీ కొండగట్టుగా పిలవబడుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలోని గద్దలపై బండపై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ వారి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు. వేకువజాము నుండి అంజన్న మాలాధారణ భక్తులతో పాటు భక్తులు హనుమత్పురి గుట్టపైకి విచ్చేశారు.
అనంతరం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులతో విగ్రహాలతో పల్లకిలో స్వామివారిని స్తుతిస్తూ వేలాదిగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ సమయంలో మహిళలు కోలాటాలు భజనలతో హోరెత్తించారు. ఆలయ అర్చకులు ఉపేందర్ శర్మ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొండగట్టు తర్వాత మినీ కొండగట్టుగా పిలబడుతున్న కొప్పూర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎత్తున కొండపై ఉండడంతో ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారి పాదాలు ఉండడంతో ఈ ప్రాంతానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. భక్తుల కొరకు ప్రత్యేకంగా ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేష్ గుప్తా అల్పాహారంతో పాటు భోజన వసతి ఏర్పాటు చేశారు.






