21-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, జనవరి 20 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 51 వ డివిజన్లో 15 లక్షల రూపాయల సాధారణ ని ధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తా వెళ్ళు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని, వారు ప్రత్యేకంగా కరీంనగర్ కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని.. అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కరీంనగర్ నగరానికి తీసుకు రాలేదని విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన సీఎం అస్యూరెన్స్ నిధులతో అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు.
గతంలో ఈ రోడ్డును కొంతమంది అడ్డుకున్నారని తద్వారా రోడ్డు నిర్మాణం జరగలేదన్నారు. కానీ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నదని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాబోవు నగరపాలక సంస్థ ఎన్నిక ల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజి కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, డివిజన్ నాయకులు మల్లారెడ్డి, శేఖర్, చందు, బండారు ఆంజనేయులు, మధుకర్ పటేల్, దేవేందర్, ఆనందరావు, అంజన్ రావు, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మిడిదొడ్డి నవీన్, కిరణ్, పవన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.