calender_icon.png 15 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక నిధులకు కేంద్రం సానుకూలం

15-01-2026 01:40:24 AM

త్వరలో మొదటి విడత రూ. 260 కోట్లు విడుదల: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ర్టంలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. త్వర లో మొదటి విడత రూ.260 కోట్లు విడుదల చేయనుందని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తే మిగిలిన రూ.2,500 కోట్లు రిలీజ్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని, యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాల్లా కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సహకరించాలని కోరారు.

ఈ మేరకు కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత దశాబ్ద కాలంగా.. తెలంగాణ రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం.. రూ.11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందన్నారు. 2023--24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఖర్చుపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ల(యూసీ)ను ఇటీవలే సమర్పించారని, దీనికితోడూ గ్రామపంచాయతీలకు ఎన్నికలు కూడా పూర్తయిన నేపథ్యంలో.. 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులైన రూ.260 కోట్లను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు.

వీటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వగానే దశల వారీగా మిగిలిన రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల కానున్నాయని ఆయన పేర్కొన్నారు. 2020-21 నుంచి 2025-26 మధ్యలో ఈ కేటాయింపులు 80 శాతం (రూ.9,050 కోట్లు) పెరిగాయని, ఇందులో రూ.6,051 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. 2015-16 నుంచి 2019--20 మధ్యలో రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రూ.5,060 కోట్లు విడుదల చేసిందన్నారు.

నిధుల వినియోగానికి బ్యాంకు ఖాతా తెరవాలి

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నిధుల వినియోగం కోసం తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని, ఈ అకౌంట్ పీఎఫ్‌ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్‌లో నమోదు చేసుకుని యూనిక్ ఏజెన్సీ కోడ్‌ను పొందాలని సూచించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల అకౌంట్లను జప్తుచేసుకుని, ఆ నిధులను ఇతర అవసరాల కోసం దారి మళ్లించిందని, దీని కారణంగా చాలా మంది సర్పంచ్‌లు తమ హయాంలో చేసిన పనులకు నిధులు రానందున రాజీనామాలు చేశారని తెలిపారు. కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇది చాలా దురదృష్టకరమన్నారు.

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు సహకరిస్తూ.. గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు చొరవతీసుకోవాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా.. మారుమూల ప్రాంతాల వరకు కూడా జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను మొదటి నుంచీ కేంద్రం సమయానుగుణంగా విడుదల చేస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.