టిమ్స్ ప్రాంగణంలోనే చైతన్యపురి పోలీస్ స్టేషన్ నిర్మించాలి
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మే 28 : కొత్తపేట లోని టిమ్స్ దవాఖాన ప్రాంగణంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు ప్రత్యేక స్థలం కేటాయించారని, ఇందులోనే పోలీస్ స్టేషన్ నిర్మించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిమ్స్ దవాఖాన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నా నేపథ్యంలో అక్కడ కేటాయించిన స్థలంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ నిర్మించాలి. కానీ, స్థలం కేటాయింపుపై అధికార ఉత్తర్వులు రాకపోవడంతో పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా చైతన్యపురి డివిజన్ లోని వికాస్ నగర్ లోని మీ సేవా భవనాన్ని పోలీస్ స్టేషన్ కోసం, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ను మీసేవా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురువారం స్థానికులతో కలిసి అధికారుల ఏర్పాట్లను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ని ఘటనా స్థలానికి పిలిపించి, మాట్లాడారు. న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీసేవ కార్యాలయానికి ఇవ్వబోమని, వికాస్ నగర్ లోని మీ సేవా కార్యాలయాన్ని చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు ఇవ్వమని స్పష్టం చేశారు. అనంతరం మీసేవా, వార్డ్ కార్యాలయానికి వెళ్లి తాళం వేశారు. కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీవాసులు సుష్మిత, రోజా పద్మిని, భవాని నగర్ కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వికాస్ నగర్ కాలనీ అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు శోభారాణి, పవన్ సంతోష్, తులసి కృష్ణ,గట్టు శ్రీను, రమణారెడ్డి, జలంధర్, కిరణ్, నరేశ్, శ్రీధర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






