ఘనంగా ఎన్టీఆర్ జయంతి
మంగపేట, మే 28 (విజయక్రాంతి): స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను గురువారం మంగపేట మండల కమ్మ సంఘం, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాడగూడెం, మంగపేటలలో ఎన్టీఆర్ విగ్రహాలకు, కమలాపురం, రాజుపేట గ్రామాలలో టీడీపీ జెండా గద్దెల వద్ద, గంపోనిగూడెంలో పార్టీ స్థలంలో జెండా గద్దె వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త నందమూరి తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల కమ్మ సంఘం సభ్యులు , ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






