17 June, 2026 | 4:30 PM

Breaking News

కొత్త పాలకవర్గం ముందు ‘సమస్యల’ సవాల్..

26-02-2026 12:00 AM

శివారు కాలనీల గోస తీరేనా?

షాద్ నగర్, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా పేరున్న షాద్నగర్లో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. అయితే, అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు పట్టణంలోని మౌలిక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా విస్తరిస్తున్న శివారు కాలనీల్లో సౌకర్యాల లేమి ప్రజలను వేధిస్తోంది. గత దశాబ్ద కాలంలో షాద్నగర్ పట్టణం శరవేగంగా విస్తరించింది. 28 వార్డులు, 53,403 మంది ఓటర్లతో జిల్లాలోనే కీలక కేంద్రంగా మారింది. పాత బస్తీ (ఫరూక్ నగర్) ప్రాంతాల్లో సమస్యలు కొంత మేర అదుపులో ఉన్నప్పటికీ, కొత్తగా వెలుస్తున్న కాలనీల పరిస్థితి దయనీయంగా ఉంది. 

శివారు కాలనీల దుస్థితి..

చటాన్ పల్లి, హాజిపల్లి రోడ్డు, సీఎస్కే విల్లాస్ మరియు ఫరూక్ నగర్ శివారు ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు వెలుస్తున్నా.. అక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు కంటికి కనిపించడం లేదు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఫరూక్ నగర్ శివారులోని బొబ్బిలి చెరువు, నేడు పట్టణ మురుగునీరంత చేరి డ్రైనేజీ కుంటలా మారిపోయింది. తీరని తలనొప్పి పట్టణానికి ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ అంశం కొత్త పాలకవర్గానికి పెద్ద పరీక్షగా నిలిచింది.

ప్రస్తుతం సోలిపూర్ గ్రామ శివారులో చెత్తను పారబోస్తుండగా, స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాలుష్యం పెరుగుతోందని, వెంటనే యార్డును తరలించాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు జరుగుతున్నా కార్యరూపం దాల్చలేదు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో, పాలకవర్గం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. 

మున్సిపల్‌లో  ప్రధాన సమస్యలు..

పరిశీలిస్తే రోడ్లు శివారు ప్రాంతాల్లో మట్టి రోడ్లు, గుంతలు సిసి రోడ్ల నిర్మాణం, మెయిన్ రోడ్ల విస్తరణ,డ్రైనేజీ చెరువుల్లోకి మురుగు నీరు, అస్తవ్యస్త కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ,డంపింగ్ యార్డ్ సోలిపూర్ వద్ద నిరసనలు, స్థల మార్పిడి పెండింగ్ శాశ్వత వ్యర్థాల నిర్వహణ, ప్లాంట్ ఏర్పాటు, నీటి సరఫరా అప్పుడప్పుడు అంతరాయాలు పైపులైన్ల ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.

మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యం..

ఇటీవల మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అగనూర్ బసవేశ్వర్  పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేశారు. షాద్నగర్ పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడమే మా ప్రథమ ప్రాధాన్యత. అని వార్డుల వారీగా సమస్యలను గుర్తించి, నిధుల కేటాయిం పులో ప్రాధాన్యత క్రమాన్ని పాటిస్తాం.

యువత, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ షాద్నగర్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మూడవసారి పీఠాన్ని దక్కించుకున్న ఈ తరుణంలో, ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తేనే షాద్నగర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.