15-05-2025 12:00:00 AM
- 10వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు
- అదనంగా 500 నివాసాలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): తరాలుగా సొంతింటి కలకు నోచుకోని ఆదిమ గిరి జన తెగలలోకి అతి బలహీనవర్గమైన చెంచుల సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేయబోతోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం నాలుగు ఐటీడీఏల పరిధిలో 10వేల చెంచు కుటుంబాలు ఉన్నట్టు గుర్తించామని, వీరందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీ క్షించారు.
గిరిజన ప్రాంతాల్లో శాశ్వత నివాసాలను నిర్మించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సూచించారని చెప్పారు. వారి సూచనల మేరకే గిరిజన ప్రాంతాల్లోని చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్ 3,551, బోథ్ 695, ఖానాపూర్. సిర్పూర్ 311, ఆదిలాబాద్ బెల్లంపల్లి భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అశ్వారావుపేట 105, మున్ననూరు చెంచు స్పెషల్ ప్రాజెక్ట్‌లో అచ్చంపేట్ 518, మహబూబ్‌నగర్ పరిగి 138, తాండూరు 184 కలిపి మొత్తం 9,395 ఇండ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ ఏడాది రాష్ర్టంలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు గాను 20 శాతం ఇండ్లను బఫర్ కింద పెట్టుకుంటున్నట్టు చెప్పారు.
గతప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి హైదరాబాద్‌లో ఉన్నపేదలకు కేటాయిస్తే, వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.