చెలరేగుతున్న గిరిగిరి మాఫియా!?
పేదలపై అధిక వడ్డీల భారం
మహిళల పట్ల అనుచిత ప్రవర్తన
ఇల్లెందులో మూడు పువ్వులు చందాన దందా
ఇల్లందు, మే 1 (విజయక్రాంతి): నల్ల బంగారు కానీ ఇల్లెందులో గిరి గిరి చిట్టీల మాఫియా చెలరేగిపోతుంది. ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వడ్డీ వ్యాపారులు పట్టణంలో గిరి గిరి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్షణ అవసరాల కోసం డబ్బు కావాల్సిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఇంటింటికి తిరుగుతూ తమ పేర్లు, ఫోన్ నంబర్లు ముద్రించిన కూపన్ కార్డులు పంచుతూ సులభంగా అప్పు ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. బ్యాంకులు, సహకార సంస్థల్లో ఉండే విధానాలు, పత్రాలు అవసరం లేదని చెప్పి ఎలాంటి హామీలు లేకుండానే డబ్బు అందజేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చిన్న మొత్తాల్లో ఇచ్చే అప్పులకు రోజువారీ లేదా వారంవారీగా అధిక వడ్డీ విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వడ్డీపై వడ్డీ విధానం అమలు చేస్తూ అప్పుదారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే సమాచారం అందుతోంది. వడ్డీ చెల్లింపులు ఆలస్యం అయితే ఒత్తిడి పెంచుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొదట ఐదు వేల రూపాయలు తీసుకున్నాం& ఇప్పుడు వడ్డీ పేరుతో పది వేలకుపైగా చెల్లించాం అని ఒక బాధితుడు తెలిపారు. రోజూ వడ్డీ కోసం ఒత్తిడి చేస్తున్నారనే అనుభవం ఎదురవుతోంది అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
ఒకసారి ఈ విధమైన అప్పుల్లో పడిన తర్వాత బయటపడటం కష్టమవుతోందని స్థానికులు చెబుతు న్నారు. ఇక గృహిణులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్లో భర్త లేని సమయంలో వెళ్లి అప్పు ఇస్తామని చెప్పడం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసౌకర్యంగా అనిపించే విధంగా మాట్లాడుతున్న ఘటనలు ఉన్నాయి అని ఒక మహిళ తెలిపారు. ఈ పరిస్థితులు మహిళల భద్రతపై కూడా సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ఆర్థిక అవగాహన తక్కువగా ఉన్న కుటుంబాలు ఇలాంటి అప్పుల వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్న అప్పులు అధిక వడ్డీ కారణంగా పెరిగి కుటుంబాలపై భారంగా మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేకుండా అధిక వడ్డీకి అప్పులు ఇవ్వడం చట్ట విరుద్ధమయ్యే అవకాశముందని, ఇలాంటి కార్యకలాపాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.
తెలియని వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, అవసరమైతే బ్యాంకులు లేదా ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు పొందాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మహిళల భద్రతపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.






