8 June, 2026 | 2:13 AM

పాఠశాలల కుదింపు ఆలోచన ప్రభుత్వానికి సరైంది కాదు

08-06-2026 01:19 AM

పాఠశాలల మూసివేతతో పేదలు విద్యకు దూరం అవుతారు ః టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్

కామారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల లను కుదింపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం తగదని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి లు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన లో ఖండించారు. శనివారం ద హిందూ పత్రిక నిర్వహించిన సదస్సులో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించనున్నామని ప్రకటించారు.

హేతుబద్ధీకర ణలో భాగంగా తండాలు, ఎస్సీ, బీసీ కాలనీలలోని పాఠశాలలను మూసివేస్తామని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామని  ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి గ్రామపంచా యతీకి పాఠశాల ఉండాలని, మూతబడిన ప్రతి పాఠశాలను కూడా తెరిపిస్తామని ప్రకటనలు చేసిన  ముఖ్యమంత్రి  నేడు పాఠశాలలను మూసివేస్తామని ప్రకటనలు చేయడం సరైనది కాదని అన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎఫ్)రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి లు తెలిపారు. 

విద్యను ప్రైవేటికరించి కార్పోరేట్ శక్తులకు అందించి విద్యావ్యాపారాన్ని బలోపేతం చేయడమే అవుతుందన్నారు. ప్రజల పాలన ప్రజాపక్షం అని మాట్లాడుతున్న పాలకులు ప్రజలకు వ్యతిరేకమైన విద్యారంగ వ్యతిరేకమైన నిర్ణయాలు చేయడం సరైనది కాదు అన్నారు. వందలాది సంవత్సరాలుగా విద్యా మేధావులు చేసిన పోరాటాల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన విద్యను, పాఠశాలలను దూరం చేస్తే టిపిటిఎఫ్ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వారు తెలిపారు.