29-08-2025 12:45:14 PM
జాతీయ బీసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూరెళ్ల నితీష్
మంచిర్యాల, (విజయక్రాంతి) : విద్య వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భ్రష్టు పట్టిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ జాతీయ బీసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూరెళ్ల నితీష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారనీ, ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు రావాలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ కళాశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారన్నారు.
పై చదువులకు వెళ్లాలంటే విద్యార్థుల సర్టిఫికెట్స్ లని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకి గురి చేస్తున్నారనీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్ బకాయిలు ఇవ్వకుండా ఎన్నికలకు పోతున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా రోజులు గడుపుతున్నారని, హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారనీ, స్కాలర్ షిప్ మీరిచ్చే భిక్ష కాదని, అది మా హక్కు అని, విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్, అదనాన్, శ్రీకర్, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.