8 July, 2026 | 2:02 AM

నకిలీ విత్తనాల బెడద

08-07-2026 12:00 AM

దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రకృతి వైపరీత్యాలతోనే కాదు, కొందరు ధనాశతో చేస్తున్న మోసాలతోనూ నిత్యం పోరాడాల్సి వస్తున్నది. ఎండా, వాన, అతివృష్టి, అనావృష్టి లాంటి విపత్తులతో కలబడి నిలబడుతున్న అన్నదాత నకిలీ విత్తనాల చేతుల్లో మాత్రం ఓడిపోతున్నాడు. ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని వీడుతున్నాడు. నకిలీ విత్తనాలు రైతు శ్రమనే కాదు; అతని కుటుంబాన్ని కూడా కబళిస్తుండటం బాధాకరం. ప్రతి సీజన్‌లో అన్నదాత అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేస్తాడు.

కానీ, తాను కొంటున్న విత్తు అసలుదా, నకిలీదా? అన్నది పంట పెరిగాక కాపు దశలోనే తెలుస్తుంది. దీంతో అప్పటివరకు దుక్కి దున్నడం, విత్తనాలు, కూలీలు, ఎరువుల రూపంలో పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలవుతున్నది. చివరికి రైతన్నకు మిగిలే అప్పులు, కన్నీళ్లు అతన్ని ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కంటే ఎక్కువగా కర్షకులను నష్టాలపాలు చేస్తున్న ఈ సంక్షోభం ఏ ఒక్క పంటకో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనది కాదు. పాలకులు, అధికారులు మారుతున్నా ఈ నకిలీ దందాకు అడ్డుకట్టపడకపోవడం శోచనీయం.

నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, తనిఖీలు చేస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం ఏటా ప్రకటిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ, వేలాది నకిలీ విత్తనాల సంచులు రైతుల వరకు ఎలా చేరుతున్నాయి? ఈ అక్రమ వ్యాపారం ఎందుకు ఆగడం లేదు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. వీటి వల్ల రైతు మాత్రమే నష్టపోవడం లేదు. పంట దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. చివరికి అప్పులపాలై అన్నదాతలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. ఇప్పటికే మన దేశ రైతాంగం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.

చాలామంది అన్నదాతలు కాడి వదిలేశారు. నవతరం మన్ను వైపు కన్నెత్తి చూడటం లేదు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు నకిలీ విత్తన దందా ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరం ఉన్నది. విత్తనాల తయారీ నుంచి విక్రయాల వరకు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. నకిలీ విత్తన దందాను నిలువరించి రైతన్నకు భరోసా కల్పించాలి. లేకపోతే దేశ రైతాంగానికి ఎవుసంపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే ప్రపంచానికి అన్నం పెడుతున్న భారత్ భవిష్యత్తులో ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.