21-06-2025 02:27:32 AM
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్2’. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ ఆరో చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అయాన్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించటంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తా. ‘వార్2’ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించా.
బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్‌రెడీ బ్లాక్‌బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని ఇద్దరు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజం చెప్పాలంటే.. ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగ్నమయ్యా.
ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా చేసిందీ సినిమా. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు.
అలాంటి వారు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలనే ఆలోచించి రూపొందించాం. ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేసుకునేలా ఈ సినిమాను తెరకెక్కించాం. హృతిక్, ఎన్టీఆర్ కలయికలో గూజ్‌బమ్స్ తెప్పించే సన్నివేశాలతో గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది” అన్నారు.