15-07-2025 11:22:05 AM
అనంతగిరి: నాగార్జున సాగర్ కాలువ(Nagarjuna Sagar Canal) నుంచి నీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ నీళ్లు అవసరం ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు నీరు విడుదల చెయ్యకపోవడం దారుణమని మండిపడ్డారు. సాగర్ కాలవ నుండి నీటిని విడుదల చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతిసారి ముందస్తుగా నీటిని విడుదల ప్రారంభమయ్యేది.
కానీ ఈసారి మాత్రం జాప్యం జరగడంతో రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం కొందరు రైతులు బోరు బావలను నమ్ముకొని పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. సాగర్ కాలువ నుండి నీటిని విడుదల చేస్తే నడిగూడెం అనంతగిరి మండలాల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేశారు. చాకిరాల మేయర్ రిజర్వాయర్ నిండి దిగువన ఉన్న కాలువలకు నీరు విడుదల చేస్తే రెండు మండలాల్లో చాలా చెరువులు నిండుతాయని చెప్పారు. ఈసారి కూడా త్వరగా నీళ్లు వదిలితే రైతులకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్ నుంచి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు నీటిని వదిలారు కానీ కొత్తగూడెం మేయర్ కాలువకు మాత్రం నీటిని విడుదల చేయడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించి నీటిని విడుదల చేసి రైతులు పంటలు సాగు చేసే విధంగా చూడాలని వేనేపల్లి వెంకటేశ్వరరావు కోరుతున్నారు.