15-07-2025 01:30:55 AM
అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే..బీసీలకు ౪౨% రిజర్వేషన్లు ఇస్తాం
-నాగార్జునసాగర్ గడ్డమీద కూర్చుందామా.. కూలిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూర్చుందామా
-నల్లగొండ తులసీవనంలో ఒక గంజాయి మొక్క ఉంది!
-పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే.. ఒక్కరిని చేర్చలే..
-పేదల ఆత్మగౌరవానికి చిహ్నం రేషన్ కార్డు
-పేదల కడుపులు నింపేందుకే సన్నబియ్యం ఇస్తున్నాం
-తెలంగాణ చరిత్రలో నల్లగొండది ప్రత్యేక స్థానం
-స్థానిక ఎన్నికల్లో వందశాతం అభివృద్ధి చేసినోళ్లను గెలిపించాలి
-తుంగతుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
-రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం
-5 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట, జూలై 14 (విజయక్రాంతి) : పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఒక్క రేష న్ కార్డు కూడా ఇవ్వలేదని, ఒక్క యూని ట్ కూడా అదనంగా చేర్చలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ నేడు ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి చిహ్నం అనే విషయాన్ని గుర్తించి, లక్షలాదిమంది పేదలకు నూతనంగా రేషన్ కార్డులు అందిస్తున్నదని తెలిపారు. కాలుతున్న పేదల కడుపులు నింపాలన్న లక్ష్యంతోనే సన్నబియ్యం ఇస్తుంటే బీఆర్‌ఎస్ వాళ్ల కళ్ళు మండుతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీని తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలకేంద్రంలో లబ్ధిదారులకు.. సోమవారం పౌరసరఫరాల, నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చి సన్నబియ్యం ఇస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజె క్టులే నేడు రైతులకు నీళ్లు అందిస్తున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో కూలేశ్వరంగా తయారైందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు సాగునీటి గు రించి మాట్లాడడం అంటే కూటిలో రాయితీయలేని వాడు ఏటిలో రాయి తీస్తానన డంతో సమానం అని అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై నాగార్జునసాగర్ గడ్డమీద కూర్చొని చర్చిద్దామా, కూలిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూర్చొని చర్చిద్దామా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌కు సవాలు విసిరారు.
రైతులను అనేక ఇబ్బందులు పెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రైతు భరోసా ఇవ్వడంలేదని ఇంటింటికి వెళ్లి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే 70 లక్షల మంది రైతులకు 9 వేలకోట్ల రూపాయల రైతు భరోసా నగదును అందించి వారి చెంప చెల్లుమనిపించిందన్నారు. సంక్షే మం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను వంచిస్తే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను, పెట్రోల్ బంకుల నిర్వహణ ను వారికి అందించిందన్నారు. నేడు మహిళలను 600 బస్సులకు ఓనర్లుగా చేసి ఆ బస్సులను ఆర్టీసీలో అద్దెకు నడిపేటట్లు చేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసిన.. కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. అటు సూర్యుడు.. ఇటు ఉదయించినా సరే.. బీసీలకు ౪౨% రిజర్వేషన్లు ఇస్తా మని ముఖ్యమంత్రి దృఢంగా తెలిపారు.
తులసివనంలో గంజాయి మొక్క ..
నల్లగొండ జిల్లా తులసివనంలో గంజాయి మొక్క మొలిసిందని, దానిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెరికివేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మూడు అడుగుల ఆయన ఆరడుగుల మాటలు మాట్లాడడం సరికాదని ముఖ్యమంత్రి, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. పదేళ్లు అవకాశమిచ్చిన తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. తుంగతుర్తికి నీళ్లు తేవడమంటే.. గ్లాసులో సోడా పోసినట్టు కాదంటూ చురకలంటించారు. సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులే కాకుండా.. పోలీస్‌స్టేషన్ కూడా తెచ్చుకోలేని ఘనత బీఆర్‌ఎస్ నాయకులదంటూ విమర్శించారు.
మీకు అండగా ఎమ్మెల్యే సామేలు..
రైతు రాజు అయినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుందని, సోనియమ్మ కల నెరవేరుతుందన్నారు. రూ. 50 వేలతో తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సామేలును 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలది అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా పెద్దన్నగా అండగా నిలిచి వారికి వెన్నుదన్నుగా నిలవాలని ఎమ్మెల్యేకు సూచించారు. దేవాదుల ద్వారా గోదావరి నీటిని తీసుకువచ్చి తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోరినట్లుగా తుంగతుర్తి నియోజకవర్గానికి రూ. 200 కోట్లను మంజూరు చేస్తునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసిన వారిని వంద శాతం గెలిపించాలని కోరారు.
పోరాట యోధులను అందించిన గడ్డ నల్లగొండ అని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ చరిత్రను ఎవరు లిఖించినా నల్లగొండది ప్రత్యేక స్థానమేనన్నారు. తెలంగాణలో కార్డుల ద్వారా ౧౧.౩లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం ౯౫.౫౬లక్షల మంది రేషన్ కార్డులు అందుకున్నారని తెలిపారు. తుంగతుర్తిలో రూ. ౩౪.౨౦ కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే 49 కోట్ల 50 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళలకు అందజేశారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 1170.00 లక్షలతో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాంకు, నాగారంలో 11.25 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు, అడ్డ గూడూరు లో 11.25 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు, 5.30 కోట్ల విద్యా శాఖ నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బలరాం నాయక్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు యశస్వి రెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, బత్తిని లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మురళి నాయక్, శంకర్ నాయక్, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, యాదాద్రి జిల్లా సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తుంగతుర్తిని అభివృద్ధి చేస్తాం..
రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గం రైతాంగ పోరాటానికి, రజాకార్ల వ్యతిరేక పోరాటానికి అడ్డా అని, తుంగతుర్తిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, బిక్కేరు వాగుకు బ్రిడ్జి మంజూరు చేశామని, అడ్డగూడూరు బోల్లోని గూడెం రహదారిని మంజూరు చేసామని తెలిపారు .12000 కోట్లతో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి రోడ్లు, 17వేల కోట్లతో పంచాయతీరాజ్ రహదారులను మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి హ్యామ్ విధానంలో నిర్మించేలా చేపట్టనున్నామని తెలిపారు.
పేదల కళ్ళల్లో సంతోషం
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, నూతన రేషన్ కార్డుల పంపిణీతో పేదల కళ్ళల్లో సంతోషం కనబడుతున్నదని, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీల వర్గీకరణ, సన్న బియ్యం పంపిణీ, 60 వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పన వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
దేవాదుల ద్వారా సాగునీరు ఇవ్వాలి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ 13 గ్రామాలకు ఎస్సారెస్పీ దేవాదుల ద్వారా సాగునీరు ఇవ్వాలని, అలాగే ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారా చెరువులకు నీరు వెళ్లేందుకు కాలువలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఒక్క కార్డూ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్
పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డు ఇవ్వకపోగా, ఒక్క లబ్ధిదారుని సైతం నూతనంగా చేర్చలేదన్నారు. పేదల కష్టాలు తెలిసిన ఈ ప్రజా ప్రభుత్వం ఐదు లక్షలకు పైగా నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డులలో లబ్ధిదారులను అదనంగా చేర్చిందని తెలిపారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యంను అందిస్తే అవి కోళ్ళు పారాలకు, బీర్లు కంపెనీలకు, రీసైక్లింగ్ కు వెళ్లేవన్నారు.
కానీ నేడు సన్నబియ్యం పంపిణీతో అన్నిటికీ చెక్ పెట్టినట్లైందన్నా రు. దేవాదుల నుండి గోదావరి జిల్లాలు తుంగతుర్తి కి తీసుకురావడంలో ముఖ్యమంత్రి సహకరించి, ప్రకటన చేయాలని.. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రికి ఉత్తంకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పునాది కాల్వ పనులను పూర్తి చేసి తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరానికి భునాది కాలువ నీళ్లు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువను పూర్తిగా పూడిక తీయవలసిన అవసరం ఉందనీ, దాని కింద రెండువేల ఎకరాలు ఉన్నాయని త్వరలోనే ఆ పనులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటామని తెలిపారు.