26-01-2026 12:41:03 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్‌ఎస్ నాయకులు
హరీష్‌రావుపై ధ్వజమెత్తిన మైనంపల్లి హనుమంతరావు
మెదక్, జనవరి 25 (విజయ క్రాంతి) :మెదక్ ను అభివృద్ధి చేయాలంటే మెదక్ నుండి సిద్దిపేటకు తరలించిన కార్యాలయాలను మెదక్ తిరిగి తీసుకురావాలని మాజీ మంత్రి హరీష్ రావు పై మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ధ్వజమెత్తారు. కేటీఆర్ సిరిసిల్లను దోచుకుంటే , కొంగోడు సర్దన నుండి వేల కోట్ల రూపాయల ఇసుకను మీరు దోచుకున్నారని ఆరోపించారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పలువురు కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి కోనాపూర్ సొసైటీనీ దోచుకున్నారని ఆరోపించారు.
వర్షాకాలంలో వరదలు వచ్చి విపరీతమైన నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి పంట నష్టం పై రివ్యూ చేశారని గుర్తు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వరదలు వచ్చినప్పుడు ఇలా స్పందించలేదన్నారు.. మెదక్ అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితిలో వెనుకకు వెళ్ళే పరిస్థితి లేదని అన్నారు. మెదక్ నియోజకవర్గానికి మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత రూ.200 కోట్లు తెచ్చి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మెదక్, రామాయంపేటలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.. మున్సిపాలిటీలో సీనియర్లకు అవకాశం దొరకకపోతే దగ్గరుండి నామినేటెడ్ పదవులు, జీతం వచ్చే పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయలకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని రూ.30 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
ఏడుపాయలను ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారి ఆశీస్సుల వల్లే నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడని తెలిపాడు. మెదక్ చర్చినీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి 29 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, యూత్ జిల్లా అధ్యక్షుడు పరుశురాం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రప్రాల్, అనిల్, శేఖర్, మధుసూదన్ రావు, హఫీజ్, అఫ్జల్, పవన్, శ్యాంసన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.