calender_icon.png 26 January, 2026 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్

26-01-2026 03:01:42 PM

హైదరాబాద్: సింగరేణి కుంభకోణం అంశంపై మంగళవారం భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను( Governor Jishnu Dev Varma) కలవనుంది. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గౌరవ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకుంది.

ఈ భేటీ సందర్భంగా, సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.

రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన సీఎంకు ఇతర మంత్రులకు పదవిలో కొనసాగేందుకు నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయనుంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గవర్నర్‌కు తమ నిరసనను తెలియజేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.