calender_icon.png 26 January, 2026 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పని తీరు

26-01-2026 02:12:49 PM

  1. జిల్లాలో అర్హత ఉన్న చివరి లబ్దిదారుడికి సంక్షేమ పథకాల అమలు
  2. జిల్లాలో 24 వేల 603 నూతన రేషన్ కార్డులు జారీ
  3. సన్న వడ్లు పండించిన 1.3 లక్షల రైతులకు రూ. 137 కోట్ల 81 లక్షల బోనస్ జమ
  4. పెద్దపల్లి లో గణతంత్ర  వేడుకల్లో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జనవరి 26(విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా  ప్రభుత్వ పని తీరు ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా  సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, తో కలిసి పాల్గొని పోలీసు గౌరవం వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. 

జిల్లాలో అర్హులైన నిరు పేద కుటుంబాలకు ప్రభుత్వం నూతనంగా 24 వేల 603 రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా అదనంగా 86,734 మంది పేదలు రేషన్ ద్వారా సన్న బియ్యం పోందుతున్నారని, ఖరీఫ్ 2024-25 సీజన్ కు సిఎంఆర్ రైస్ డెలీవరి 100  శాతం పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా  రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని,  వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించి, జిల్లాలో  61 మంది రైతులను ఎంపిక చేసి 23 లక్షల 36 వేల రూపాయల సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు.  46 వేల 507 మంది రైతుల నుండి 3 లక్షల 10 వేల 450 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగొలు చేసి  రూ. 137  కోట్ల 81 లక్షల బోనస్ రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు.  జిల్లాలో కోటి 68 లక్షల రూపాయల సబ్సీడితో మరో 3180 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట విస్తరించామని, మహాలక్ష్మీ  పథకం క్రింద జిల్లాలోని 1,18,781 మంది లబ్దిదారులకు 9,30,027  గ్యాస్ సిలిండర్లను రూ. 26 కోట్ల 31 లక్షల సబ్సీడితో  500  రూపాయలకే పంపిణీ చేశామని ,  ఆర్టిసి బస్సులలో మహిళలు  ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 169  కోట్ల 29 లక్షల రూపాయలను ఆదా చేసినట్లు తెలిపారు. జిల్లాలో నిరుపేదలకు  6166 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి  లబ్దిదారులకు  ప్రతి వారం నిర్మాణ పురొగతి ఆధారంగా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు.

గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న  1,34,896  మంది కుటుంబాలకు  రూ.111 కోట్ల 55 లక్షల సబ్సీడి భరించి జీరో బిల్ జారీ చేశామన్నారు. టీజీ రెడ్కో ద్వారా  మంథని, నంది మేడారం, శ్రీరాంపూర్, అప్పన్నపేట లో 12 కోట్ల తో  1 మెగా వాట్ సామర్థ్యం  చొప్పున విద్యుత్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం”  అని చెప్పిన మహాత్మ గాంధీ స్పూర్తితో   2025-26 ఆర్థిక సంవత్సరంలో  నరేగా  క్రింద  జిల్లాలో రూ. 66 కోట్ల 63 లక్షలు ఖర్చు చేసి 45 వేల 695 కుటుంబాలకు ఉపాథి చేకూర్చామని, జిల్లాలో 7716 మంది స్వశక్తి సంఘాలకు 477 కోట్ల 86 లక్షల రూపాయల బ్యాంకు లింకేజ్ రుణాలను,  వడ్డి లేని రుణాల పథకం క్రింద  8 కోట్ల 48 లక్షల నిధులు విడుదల చేశామని,  మహిళలకు ఆర్థిక , వ్యాపార  నిర్వహణలో  శిక్షణ  ఇచ్చుటకు  పెద్దపల్లి లోని రంగంపల్లి వద్ద వీ- హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. 

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది.  రాజీవ్ ఆరొగ్య శ్రీ  క్రింద మన జిల్లాలో 91 కోట్ల 14 లక్షలు ఖర్చు చేస్తూ 37 వేల 53 మంది రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించాం. 23 కోట్ల 75 లక్షలతో  గోదావరిఖని ఆసుపత్రి వద్ద చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్  బ్లాక్,  నంది మేడారంలో 5 కోట్ల 75 లక్షలతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేశామని,   51 కోట్లతో జిల్లా కేంద్రంలో చేపట్టిన  100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథనిలో చేపట్టిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,

రూ.187 కోట్ల 23 లక్షల  డి.ఎం.ఎఫ్.టి నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 18 కొత్త రొడ్లు, రూ. 119 కోట్లతో  కునారం  ఆర్.ఓ.బి, రూ.160 కోట్ల 30 లక్షలతో గోదావరిఖని  లో చేపట్టిన 350 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, 2025-26  సంవత్సరంలో 18 జాబ్ మేళాలు నిర్వహించి  290 మంది యువతకు ప్రైవేట్ సంస్థలలో ఉద్యొగాలు కల్పించినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా  రూ.16 కోట్ల 77 లక్షల ఖర్చు చేసి  ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పించామని, రూ. 41 లక్షలతో  468  పాఠశాలలకు  గ్యాస్ సిలీండర్ లు, స్టవ్ లను పంపిణీ చేసినట్లు తెలిపారు. 

జిల్లాలో ఎస్టీ, ఎస్సి, బీసీ, మైనార్టీ గురుకుల ద్వారా విద్యార్థులకు పాటు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు విజయవంతంగా ఎన్నికలను నిర్వహించి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు  పంచాయతీ పరిపాలన  పై ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డి, అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, డి.వేణు,  పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.