28 May, 2026 | 1:37 AM

రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

28-05-2026 01:06 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

కల్వకుర్తి మే 27 : రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బుధవారం వంగూరు మండల కేంద్రంలో నిర్వహించిన మహా రైతు ధర్నా కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.

ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పోలీసుల సహాయం లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదని  విమర్శించారు. ప్రజా పాలన కంటే పోలీసుల పాలన అని చెప్పుకుంటే బాగుంటుంది అంటూ మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధు అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని బలహీనపరు స్తోందని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీతో పాటు పెట్టుబడి సాయం అందించిందని బీఆర్‌ఎస్ ఘనతను గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గణేష్ రావు, నరేందర్ రావు, శ్రీపతిరావు, రాజేంద్ర రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.