10-02-2026 12:34:03 AM
ఏఐఎస్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 9( విజయక్రాంతి)కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బి) రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు.పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల కోసం ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే బీజేపీ నేత బండి సంజయ్ కార్పొరేషన్కు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయి కారి ఒప్పందం ఉందని ఆరోపించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఆ దోపిడీని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు ప్రశ్నించాలని, తగిన విధంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 132 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కనీసం 20 సీట్లు గెలుస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రజలు సరైన ఆలోచనతో సింహం గుర్తుపై ఓటు వేసి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ ఎన్నికల్లో అవినీతి పార్టీలను నీలదీసి, నిజమైన ప్రత్యామ్నాయంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.