09-04-2025 12:21:35 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన సీపీఐ ప్రజాపక్షమే అని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంను ఘనంగా శాలువాలు, పూల మాలలతో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఘనంగా సన్మానించింది.
ఈ సందర్బంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సీపీఐ పేద ప్రజల పక్షాన, కార్మికవర్గానికి నిత్యం అందుబాటులో ఉండి కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఎమ్మెల్సీగా చేసినందుకు భారత కమ్యూనిస్టు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీగా అభివృద్ధికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ నాయకత్వం ఘనంగా సన్మానించినందుకు ఎఐటి యుసి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభినందన సభకు ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు యం.డి.యూసుఫ్ అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్ సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్, ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం. నర్సింహ్మా, ఉపాధ్యక్షులు బి. చంద్రయ్య, కె. ఏసురత్నం, కార్యదర్శులు ఎస్. విలాస్. వై. ఓమయ్య, బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.