కామళ్ల నవీన్ మృతి కార్మికలోకానికి తీరని లోటు
న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం
వెలిదండ సంతాప సభలో
గరిడేపల్లి, ఆగస్టు 23: తుది శ్వాస వరకు నమ్ముకున్న ఎర్ర జెండా కోసం, పేద ప్రజల, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని ప్రజా పోరాటాలకు అంకితమైన కామళ్ళ నవీన్ మృతి ఈ ప్రాంత కార్మిక లోకానికి తీరనిలోటని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం అన్నారు. ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్ అంత్యక్రియలు ఆదివారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో అశ్రునయనాల మధ్య ఘనంగా నిర్వహించారు.
అనంతరం పార్టీ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న వయసు నుంచే విప్లవ రాజకీయాలను స్వీకరించిన నవీన్ దేశంలోని పీడిత ప్రజల విముక్తి కోసం తన పోరాటాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించారని అన్నారు. ఎర్రజెండా నీడలో జీవితాంతం ప్రజా ఉద్యమాలకు అంకితమైన నవీన్, అనేక పోలీసు నిర్బంధాలు, కుట్ర కేసులు, చిత్రహింసలను ఎదుర్కొంటూనే ఈ ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు ఊపిరి పోశాడని కొనియాడారు.
కడు పేదరికంలో జన్మించి, ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేని పరిస్థితుల నుంచి వచ్చినప్పటికీ, తన పోరాట పటిమను ఏమాత్రం వదులుకోకుండా ప్రజా ఉద్యమంలో నిలబడటం గొప్ప విషయమన్నారు. నవీన్ మృతి పార్టీకి, కార్మిక ఉద్యమాలకు తీరని లోటని పేర్కొంటూ,నవీన్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నాయకులు, కళాకారులు డప్పు చప్పుళ్లతో విప్లవ గీతాలు ఆలపిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సహచర ఉద్యమకారుల కన్నీటి వీడ్కోలు మధ్య నవీన్ అంత్యక్రియలు నిర్వహించారు.అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మదన్న, బండారి ఐలయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు, మండారి డేవిడ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. జనార్ధన్, పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్, గంటా నాగయ్య, పోటు లక్ష్మయ్య,పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.






