12-12-2025 12:23:27 AM
పాల్వంచ, డిసెంబర్ 11, (విజయక్రాంతి): కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన అభివృద్దే సిపిఐ అభ్యర్థులకు బలం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రలగూడెం, రేగులగుడెం, బంజారా, లక్ష్మీదేవిపల్లీ(U), ఉల్వనూర్, మందర్కలపాడు, సత్యనారాయణపురం, కారెగట్టు, ప్రభాతీ నగర్, యానంబెలు, కిన్నెరసాని, కోడిపుం జులవాగు, పునుగుల గ్రామపంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనా సిపిఐ ప్రజాప్రతినిధులతోనే సాధ్యమని, ప్రజలకు వెన్నంటి ఉండేది సిపిఐ ప్రజా ప్రతినిధులేనన్నారు. ప్రజల్లో మమేకమై గ్రామస్వపరిపాలన కోసం సిపిఐ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వంతో కొట్లాడి వివిధ పథకాల్లో నిధులు రాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, ప్రజాసమస్యలు పరిష్కరించగలిగామన్నారు.
ప్రతి పథకాన్ని గ్రామీణ పేదలగడప చేర్చే బాధ్యతాయుత పాలనకు కమ్యూనిస్టు పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు సర్పంచ్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.