18 May, 2026 | 3:05 AM

నగదు తీసుకో... రేషన్ బియ్యం అమ్ముకో...!

18-05-2026 01:44 AM

కొన్ని రేషన్ దుకాణాలే రేషన్ దందాకు అడ్డాలుగా మారుతున్న వైనం...? 

పేదల కడుపు నింపాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్కు చేరుతున్న దుస్థితి 

చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు

పేదవాడు ఆకలితో అలమటించకుండా కడుపు నింపాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం ను అందచేస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ చాలా వరకు రేషన్ బియ్యం ను లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోకుండా వాటిని కొన్ని రేషన్ దుకాణాల వద్ద రేషన్ దందా నిర్వహించే దళారులు నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుకుని అక్కడే కొనుగోలు చేస్తున్నారన్న విషయం సైతం అందరికి తెలిసిన కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలని ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు.

వనపర్తి, మే 17 (విజయక్రాంతి): పేదవాడు ఆకలితో అలమటించకుండా కడుపు నింపాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. నగదు తీసుకో... రేషన్ బియ్యం అమ్ముకో అన్నట్టుగా కొంతమంది దళారులు లబ్ధిదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని అదే రేషన్ దుకాణాల వద్ద బియ్యాన్ని కొనుగోలు చేస్తూ బహిరంగంగానే రేషన్ దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రేషన్ బియ్యం పంపిణీ అయ్యే సమయాల్లోనే దళారులు అక్కడే మకాం వేసి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుకుంటూ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కిలోల కొద్దీ బియ్యం చేతులు మారుతున్నా... సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదల బియ్యం ... దళారుల వ్యాపారం....? 

ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాల్సి ఉండగా... అది ఇప్పుడు కొందరు వ్యాపారులకు ఆదాయ వనరుగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కొంతమంది మధ్యవర్తులు నగదు ఆశ చూపించి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. అనంతరం అదే బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం లేదా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని రేషన్ షాపుల వద్దే బహిరంగ కొనుగోళ్లు....! 

కొన్ని ప్రాంతాల్లో కొన్ని రేషన్ దుకాణాల వద్దకే దళారులు చేరుకుని ఇప్పుడే నగదు ఇస్తాం అంటూ లబ్ధిదారులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కళ్ల ముందే ఈ వ్యవహారం జరుగుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంత బహిరంగంగా జరుగుతున్న దందా అధికారులకు కనిపించదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తనిఖీలు ఎక్కడ..? చర్యలు ఎప్పుడు..? 

రేషన్ బియ్యం అక్రమ రవాణా, కొనుగోళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు చూపు కోసం నిర్వహించే తనిఖీలు తప్ప దందాను పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం దళారుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేకపోతే ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని సామాజిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

రేషన్ బియ్యం ఉపయోగాలపై అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం ....! 

ప్రభుత్వం పేద ప్రజల ఆహార భద్రత కోసం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం వల్ల కుటుంబాలకు కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం అమ్ముకుంటే తాత్కాలికంగా చేతికి కొంత నగదు వచ్చినా... భవిష్యత్తులో అదే కుటుంబాలు ఆహార కొరతతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

పోషకాహార భద్రత, కుటుంబ ఖర్చుల తగ్గింపు, పేదల జీవనోపాధికి రేషన్ బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా... అలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. దీంతో కొంతమంది లబ్ధిదారులు దళారుల మాటలకు లోనై తక్కువ ధరలకు బియ్యాన్ని విక్రయిస్తూ ప్రభుత్వ అసలు ఉద్దేశ్యాన్నే దెబ్బతీస్తున్న పరిస్థితి నెలకొంది.

రేషన్ బియ్యంలో ఉండే ప్రధాన పోషకాలు 

రేషన్ బియ్యం కూడా సాధారణంగా ప్రజలు తినే బియ్యమే. ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకలి తీర్చడమే కాకుండా శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.

కార్బోహైడ్రేట్లు : శరీరానికి అవసరమైన ప్రధాన శక్తిని అందిస్తాయి. రోజువారీ పనులు చేయడానికి ఎనర్జీ ఇస్తాయి.

ప్రోటీన్లు : శరీర కణాల నిర్మాణం, కండరాల బలానికి కొంతమేర సహాయపడతాయి.

ఫైబర్ : జీర్ణక్రియ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దంపుడు బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ బి సమూహం : శరీరానికి శక్తి ఉత్పత్తి, నరాల పనితీరు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

ఐరన్ : రక్తహీనత తగ్గించడంలో కొంత ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా అదనంగా ఇనుము కలుపుతున్నారు.

కాల్షియం : ఎముకలు, పళ్ల బలానికి సహాయపడుతుంది.

ఫోలిక్ యాసిడ్ : గర్భిణీలు, పిల్లల ఆరోగ్యానికి ఉపయోగకరం.