నేడే వైభవంగా శ్రీ సీతారాముల దివ్య కల్యాణం
* భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
* ఆలయ ఈఓ రమాదేవి
వేములవాడ, మార్చి 26, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వ రస్వామివారి దేవస్థానం లో శ్రీరామ నవమి సందర్భంగా నేడు శ్రీ సీతారా ముల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై 11:30 నిముషాలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసి ముందస్తుగా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు, తాగునీటి కేంద్రాలు, మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు, మరియు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం చేసినట్లు తెలిపారు. నలుమూలల నుండి వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం ఆర్టిసి వారిని ప్రత్యేక బస్సులు నడపమని కోరడం జరిగింది అన్నారు.
ఇక దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రత కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితులకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుందనిశ్రద్ధాభక్తులతో పాల్గొనే భక్తులు ఆలయ నిబంధనలు పాటిస్తూ నిర్వహణకు సహకరించాలని ఈఓ రమాదేవి కోరారు.




