బీసీలకిచ్చిన హామీలు నెరవేర్చాలి
మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): బీసీలను వాడుకుని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్లను తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. గొల్ల, కురుమల పొట్ట కొట్టొద్దు అని, రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని సూచించారు. ముదిరాజ్, గంగపుత్రులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగించాలన్నారు.
ఆరోగ్యశ్రీలో కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదు
ఆరోగ్యశ్రీలో కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. 2014 జూన్ రెండో తేదీ వరకు ఆరోగ్యశ్రీకి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అయ్యేవని, 2023 వరకు ఆ ఖర్చు రూ.68 కోట్లకు పెరిగిందని, ప్రస్తుతం రూ.89 కోట్లు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని వెల్లడించారు.
గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. తాము చేపట్టిన ఆసుపత్రుల గురించి చెప్పారని, ఆ ఆస్పత్రులను పూర్తిచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, వీటిపై మాట్లాడేందుకు సభలో తమకు మైక్ ఇవ్వలేదన్నారు.




