18-07-2025 01:00:46 AM
పలు రహదారులకు నిధుల విడుదల పై ఎమ్మెల్యే హర్షం..
బోథ్, జులై 17 (విజయక్రాంతి): గత కొన్ని సంవత్సరాలుగా సొనాల రోడ్డు ఇచ్చోడ వైపు వెళ్ళే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాదాలు జరుగుతున్నా, నడవడానికి వీలు లేనంత పరిస్థితి ఏర్పడినా, మారుమూల ప్రాంతమైన మన గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడు అనుకునే తరుణంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ చొరవతో సొనాల రోడ్డుకు 1.80 కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే టెండర్లకు పిలిచి, తొందరలోనే పనులు ప్రారంభించేలా చూస్తానన్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. కాగా రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బోథ్ మండలం నుండి సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారికి 2 కోట్లు మంజూరయ్యాయి.
ఈ మేరకు రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో వారంలో టెండర్లను పిలిచి రోడ్డు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అడెల్లీ ఘాట్ రోడ్డు పనులకు ఇన్నాళ్ళకి మోక్షం లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్డు పనులను కూడా నాణ్యతగా చేపట్టాలని కోరుతున్నారు.