16 July, 2026 | 7:45 AM

అసద్ పాలన అంతం

09-12-2024 02:09 AM

50 ఏండ్ల నిరంకుశ పాలనకు తెర

  1. తిరుగుబాటుదారుల చేతికి సిరియా
  2. ముగిసిన 14 ఏండ్ల అంతర్యుద్ధం రష్యాకు చేరుకున్న బషర్ 
  3. అసద్‌కు మద్దతు ఇవ్వం: ట్రంప్ 
  4. పరిణామాలను గమనిస్తున్నాం: రష్యా

డమాస్కస్, డిసెంబర్ 8: మధ్యప్రాచ్య దేశమైన సిరియాలో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్(58) నిరంకుశ పాలన శకం ముగిసింది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌లోకి ప్రవేశించ డంతో దాదాపు 24 సంవత్సరాలుగా  పాలిస్తున్న ఆయన దేశాన్ని విడిచి పారిపోయారు. దీంతో 14 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. దాదాపు 54 ఏళ్లపాటు   నిరంకుశ పాలన కొనసాగించిన అసద్ కుటుంబ వంశపాలనకు శుభం కార్డు పడింది.

టర్కీ మద్దతు ఉన్న హయత్ తహరీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో దేశంలో అధ్యక్షుడు అసద్ పాలన అంతమైంది. నవంబర్ 27న తిరుగుబాటుదారులు దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను, ఆ తరువాత హమా, హోమ్స్, దారా పట్టణాలను క్రమక్రమంగా ఆక్రమించారు. ఆదివారం రాజధాని డమాస్కస్‌ను రెబెల్స్ చుట్టిముట్టి స్వాధీనంలోకి తీసుకున్నారు.

వారిని ఎదుర్కోలేక అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుం చి భద్రతా దళాలు పారిపోయాయి. ఈ క్రమంలో రాజధానిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సిరియా పూర్తిగా రెబెల్స్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. డమాస్కస్‌లోకి రెబెల్స్ ప్రవేశించినపుడు ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని తెలిసింది.

దీంతో దేశం మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని హెచ్‌టీఎస్ నాయకుడు జోలానీ ప్రకటించారు. 8 రోజున సిరియాలో  చీకటి యుగానికి ముగింపు, నవ శకానికి నాంది పలుకుతున్నామని హెచ్‌టీస్ ప్రకటించింది. రెబెల్స్ చేతికి డమాస్కస్ చిక్కడంతో అక్కడక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. నగరం లో తిరుగుబాటుదారులు, వారి సానుభూతిపరులు కాల్పులు జరిపి సంతోషం వ్యక్తం చేసి సంబురాలు చేసుకున్నారు.  ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్యాంక్‌లపైకి ఎక్కి ఆనందంతో నృత్యాలు చేశారు. ప్రజలు అసద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హారన్‌లు మోగించారు. రోడ్లపై అసద్ ఫొటోలను తమ బూటు కాళ్లతో తొక్కారు. 

ప్యాలెస్‌లోకి  తిరుగుబాటుదారులు 

 తిరుగుబాటుదారులు అసద్ ప్యాలెస్‌లోకి ప్రవేశించిన దృశ్యాలను సిరియన్ స్టేట్ టీవీ ప్రసారం చేసింది. అధ్యక్ష భవనంలోకి కొందరు ప్రవేశించి తమకు దొరికిన వస్తువులను, విలువైన కళాఖండాలను ఎత్తుకెళ్లారు. కొందరేమో ప్యాలెస్ లోపల సెల్ఫీలు తీసుకున్నారు. మరికొందరు సిరియా సెంట్రల్ బ్యాంకు నుంచి క్యాష్ బ్యాగులను తమ వెంట తీసుకెళ్లారు. అసద్‌కు  చెందిన లగ్జరీ కార్లను రెబెల్స్ ధ్వంసం చేశారు.

సూపర్‌కారును స్వాధీనం చేసుకున్నారు. అసద్‌కు విధేయులుగా ముద్రపడ్డ వారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అసద్ పాలన అంతమైనట్లు  మసీదులు ప్రకటించడంతో అధ్యక్షుడు అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ విగ్రహాలను జెరమానా నగరంతోపాటు దేశమంతటా రెబెల్స్ కూల్చివేస్తున్నారు. దేశంలోని జైళ్లనుంచి ఖైదీలను రెబెల్స్ విడిపించారు. అయితే అధికార మార్పిడి సజావుగా జరిగే వరకు ప్రధానమంత్రి మహమ్మద్ అల్ పరిపాలిస్తారని ప్రతిపక్షాలు ప్రకటించాయి.

దేశం లో శాంతియుత అధికార మార్పిడికి అసద్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. తిరుగుబాటుదారులు, ఇతర భాగస్వాములతో చర్చలు జరిపిన తరువాత అసద్ దేశం విడిచిపెట్టినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. సిరియాలో మోహరించిన బలగాలను హై అలర్ట్‌లో ఉంచామని, ఇప్పటివరకు తమ స్థావరాల భద్రతకు ముప్పేమీ లేదని రష్యా ప్రకటించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు పేర్కొంది. 

ఇష్టం లేకుండానే అధ్యక్షుడిగా

బ్రిటన్‌లో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్న అసద్ 34 సంవత్సరాల వయసులో 200౦ సంవత్సరంలో సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ 197౦లో తిరుగుబాటు  చేసి అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు చేపట్టి 2000 సంవత్సరంలో చనిపోయేవరకు పాలించాడు. ప్రజలను తీవ్రంగా అణిచివేశాడు. అయితే హఫీజ్ మరణం తరువాత అతని పెద్ద కొడుకు బషీర్ అధ్యక్షుడు కావాల్సి ఉంది.

కానీ 1994లో బషీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో తన తండ్రి హఫీజ్ చనిపోవడంతో 2000 సంవత్సరంలో అసద్ సిరియాకు తిరిగి వచ్చి తనకు ఇష్టం లేకున్నా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు. అసద్ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో అసద్‌కు వ్యతిరేకంగా 2011లో ప్రజలు ఆందోళనలు చేస్తే కఠినంగా అణిచివేశాడు. రష్యా, ఇరాన్, హెజ్‌బొల్లా, షియా గ్రూపుల సహాయాన్ని తీసుకున్నాడు. మరోవైపు టర్కీ, ఖతార్ తదితర దేశాలతో శత్రుత్వం పెరిగింది. ఈ నేపథ్యంలో అసద్‌ను గద్దె దించడానికి హెచ్‌టీఎస్ ఉగ్రవాద సంస్థకు టర్కీ మద్దతు ప్రకటించింది. షియా  వర్గంలోని అలవైట్ వర్గానికి చెందిన అసద్ కుటుంబం  సిరియాలో మైనార్టీలుగా ఉన్నది.

అరబ్ విప్లవం స్ఫూర్తితో

మిడిల్ ఈస్ట్‌లోని ట్యునీషియాలో మొదలైన అరబ్ స్ప్రింగ్ స్ఫూర్తితో 2011లో సిరియాలో అధ్యక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొద లైంది. రెబెల్స్ డమాస్కస్‌ను ఆక్రమించారు. అయి తే రష్యా, ఇరాన్ సహాయంతో ప్రజల నిరసనలను అసద్ కఠినంగా అణిచివేశారు. తిరుగుబాటుదారులను రాజధాని నుంచి తరిమికొట్టారు.

అప్పటి ను ంచి దేశంలో హెచ్‌టీఎస్‌తో పాటు పలు తీవ్రవాద సంస్థలు  కొన్ని ప్రాంతాలపై దాడి చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దేశంలోని కేవలం 60% ప్రాంతం మాత్రమే అసద్ నియంత్రణలో ఉం డేది. 2024లో అసద్ దేశం నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు దేశమంతా రెబెల్స్ చేతిలోకి వెళ్లింది. 

హెచ్‌టీఎస్

2011 తరువాత ఫ్రీ సిరియన్ ఆర్మీ, అల్‌ఖైదాకు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ మిలిటెన్సీ గ్రూప్ హయత్ తహరీర్ అల్ షామ్( హెచ్‌టీఎస్)  అసద్‌పై తిరుగుబాటును ప్రారంభించాయి. ఈ  క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రజలు చనిపోయారు. 2024లో డమాస్కస్‌ను రెబెల్స్ ఆక్రమిచడంతో అసద్ దేశం విడిచివెళ్లాడు. దీంతో శాంతియుత అధికార మార్పిడికి మార్గం సుగమమైంది. 

సిరియా భవిష్యత్తుపై ఆందోళన

తిరుగుబాటుదారుల  చేతుల్లోకి సిరియా వెళ్లడంతో దాని భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. సిరియాకు ఇన్నాళ్లు అండగా ఉన్న రష్యా, ఇరాన్ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా, ఇరాన్ , హెజ్‌బొల్లా సహకారంతో ఇన్నాళ్లు పాలన సాగించిన అసద్ చివరి దశలో అవి చేతులెత్తేయడంతో దేశం నుంచి పారిపోయాడు. దీంతో దేశంలో ఏమి  జరుగు తుందో నని భయాందోళనలు నెలకొన్నాయి. సిరియా తమకు మిత్రదేశం కాదని, ఎటువంటి జోక్యం చేసుకోబోమని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ప్రకటించారు.

అసద్ తండ్రి విగ్రహాలు కూల్చివేత

రెబెల్స్ సిరియాను స్వాధీనం చేసుకున్న తరువాత  దేశంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పిన అధ్యక్షుడు అసద్ తండ్రి  హఫీజ్ అల్ అసద్ విగ్రహాలను కూలగొట్టారు. మరికొన్ని చోట్ల ధ్వంసం చేశారు. శిథిలాలకు తాళ్లను కట్టి లాక్కెళ్లారు.