11 August, 2026 | 1:52 AM

మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి : -నారాయణపూర్ వాసుల దీక్ష

11-08-2026 12:17 AM

చొప్పదండి,ఆగస్టు10(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.కాగా ఈ రిలే నిరాహార దీక్షలకు సోమవారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ లు  పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.మేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు బిఆర్‌ఎస్ పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ

 పోలీసులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నారాయణపూర్ గ్రామస్తులపై ఎందుకు ఇంత కక్ష కట్టావని సూటిగా ప్రశ్నించారు. . ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామని అన్నారు.