భావోద్వేగాల ‘తార తీరం’
‘సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించబోతున్నాడు. కొత్తపట్నం బీచ్‌లో ఆకాశం నారింజ రంగు నుంచి బంగారు కాంతిలోకి మారుతోంది. అక్కడ ఉండే అలలు మెల్లగా తీరానికి చేరి, ఇసుకను ముద్దాడి తిరిగి వెళ్లిపోతున్నాయి. దూరంగా జాలరి పడవల మీద ఆరబెట్టిన వలలపై సూర్యుడి కిరణాలు పడి తళతళ మెరుస్తున్నాయి’ అనే వాక్యాలతో ‘తార తీరం’ నవల ప్రారంభమతుంది. నవలాకారుడు చిరాగ్ ఎంతో అందమైన ప్రకృతి వర్ణనతో నవలను ప్రారంభిస్తాడు. ‘రెక్కల ప్రపంచం’ అనే మొదటి అధ్యాయంతో నవల షురూ అవుతుంది.
చల్లటి సాయంత్రం వేళ అమ్మ ఆద్యతో కూర్చుంటాడు నాలుగేళ్ల పిల్లాడు సూర్య. పేపర్ విమానాలు తయారు చేసి ఇద్దరూ కలిసి గాలిలోకి విసిరి ఆనందిస్తారు. ఇక్కడ మొదలైన సూర్య జీవిత ప్రయాణం.. చివరకు జావెలిన్ త్రో అథ్లెట్‌గా భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించే వరకూ సాగుతుంది. నవల ఆరంభంలో ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. తర్వాత సూర్య అనాథగా మిగిలిపోతాడు. చాచా అనే స్పోర్ట్స్ కోచ్ సూర్యను చేరదీసి అనాథశ్రమంలో చేరుస్తాడు. క్రీడల్లో తర్ఫీదు ఇస్తాడు.
ఈక్రమంలో సూర్యకు అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెరుగుతుంది. జావెలిన్ ప్లేయర్‌గా సూర్య అనతికాలంలోనే ఎదుగుతాడు. ప్రయాణంలో సూర్యకు మేఘన, విక్కీ, సోను, కిరణ్ స్నేహితుల వుతారు. అప్పటి సూర్య వద్ద తల్లి ఆద్య ఫొటో మాత్రమే ఉంటుం ది. అమ్మ ప్రేమ కోరుకున్నా చనిపోయిందనే వాస్తవం తెలుసు. అయినప్పటికీ, చాచాతో పాటు స్నేహితులతో సమయం గడుపు తూ, చదువుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అప్పడప్పుడూ స్నేహితులతో మందు కొట్టడం, సరదాగా గడపడం వంటి సన్నివేశాలు అద్భుతంగా సాగుతాయి.
జీవితం ఇలా ఉండగా సారా అనే అమ్మాయి తనకు తారసపడుతుంది. ఇక అప్పటి నుంచి సూర్య జీవితం ఎన్ని మలుపులు తీసుకుంది..? కనీసం తల్లిదండ్రులు వీళ్లు.. చెప్పేందుకు వీలు లేని ఒక అనాథ తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు? హిందువు పేరు గల సూర్య ముస్లిం అమ్మాయి అయిన సారాను ఎలా దక్కించుకున్నాడు? భారత దేశానికి గోల్డ్ మెడల్ ఎలా దక్కించుకున్నాడు? అన్నదే.. మొత్తంగా నవల కథ. మధ్య మధ్యలో చిన్నప్పుడు తనను పెంచిన అమ్మ ఆద్య.. అసలు తల్లి కాదని, ఆమెను చంపించారని తెలుసు కోవడం, తన అసలు తల్లి వేరే ఉందని తెలియడం, కన్నతల్లిని కన్నతల్లి అని తెలియకుండా యాదృచ్ఛికంగా తోటి ప్రయాణికు రాలిగా కలుసుకోవడం, చివరకు ఆమే..
సూర్య ప్రేమను నిలబెట్టేం దుకు ముందడుగు వేయడం& వంటివి నవలలో ట్విస్టులు. ముఖ్యంగా సూర్య, సారా ప్రేమను సఫలం చేసేందుకు దోహదం చేసే జానీ అనే పాత్ర నవల పూర్తి చేసిన ప్రతి పాఠకుడికీ గుర్తుండి పోతుంది. నవలలో ఉండేవి తక్కువ కావడం, ఉన్న ఆ తక్కువ పాత్రల మధ్యనే తీవ్రమైన భావోద్వేగాలు ఉండటం నవలకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా ప్రతి అధ్యాయం చివర, ఆ అధ్యాయాన్ని మననం చేసుకునేలా, మనసును హత్తుకునేలా ముక్తాయింపు రాయడం నవలకు హైలెట్. ఉదాహరణకు ఒక అధ్యాయం చివర ‘కొన్ని కథలు గమ్యాన్ని చేరుకునేందుక మొదలవుతాయి. కానీ, మధ్యలో విధి ఒక కొత్త ముగింపు రాస్తుంది’ అంటాడు రచయిత.
మరో అధ్యాయం చివర ‘కొన్ని క్షణాలు చిన్నవే అయినా, మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను మోస్తాయి’ అంటాడు మరోచోట. ఇంకా నవలలో ఎదురుపడే కాఫీ హోటళ్లు, ఇరానీ చాయ్‌లు, అత్తరు గుబాళింపులు, బాతాఖానీలు.. హైదరాబాద్ దక్కనీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. రైల్వేస్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూపులు, పడిగాపులు, ప్రేయసి కోసం ఎలాగైనా రైలు అందుకోవాలనే తహతహలూ ఇవన్నీ నవలలో అంతర్భాగంగా ఉండి కథను ముందుకు నడిపిస్తాయి. గాఢమైన ప్రేమ సాంద్రత తెలిసిన వారు, స్నేహంలోని లోతైన మాధుర్యం తెలిసిన ప్రతి పాఠకుడు చదవాల్సిన పుస్తకమిది. వారందరికీ ఈ నవలొక నిజమైన ‘తార తీరం’
కత్తుల రితిక్






