calender_icon.png 14 July, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుభవైకవేద్యం ‘నెమ్మినీలం’

14-07-2025 12:08:40 AM

ప్రసాదమూర్తి

84998 66699

జయమోహన్ :

చాలామంది ఒక నీతిని ఒక సందేశాన్ని ముందు పెట్టుకొని ఆ తర్వాత కథలు అల్లుతారు. వాళ్ల దృష్టి ఎప్పుడూ చివరగా తాము అనుకున్న  నీతి ని సందేశాన్ని పాఠకులకు సరిగ్గా అందజేస్తున్నామా, లేదా అనే దాని మీదే ఉంటుం ది. అది చివరకు ఎంత దాకా వెళ్లిందంటే ఇక అందరూ ఈ కథలో నీతేమిటి? సం దేశం ఏమిటి? రచయిత ఏం చెప్పాలనుకున్నాడు? అని మాత్రమే చర్చిస్తూ దాని చుట్టూ మాత్రమే తిరిగే దాకా వెళ్లింది విషయం.

అలా మిగిలింది కథ.. కవిత్వం. ఇలా మిగిలాం మనం. ఇలాంటి వాతావరణానికి భిన్నంగా నాకు కొన్ని  కథలు కనిపించాయి. ఏమిటా కథలు.. వాటిని నేను అర్థం చేసుకున్న తీరు ఏమిటి.. అదే ఇక్కడ చెప్తాను. కథలు నీతిమంతంగానూ, ధర్మంగానూ, మానవీయంగానూ ఉంటా యి. అయితే.. వాటిల్లో రచయిత వ్యూహం గాని, పథకాలు గాని పాఠకుడికి కనిపించవు. అలాంటి వారు తమ అనుభవాలను మూటగట్టి, దానికి ఒక పేరు పెట్టి కథగా మన ముందు వదులుతారు.

అవి రచయిత అనుభవాలా లేక కల్పితాలా? అన్న చర్చ పాఠకుడి మదిలో రేకెత్తదు. చివరికి ఆ రచయిత తాను ఈ కథను కల్పించాను.. అని చెప్పినా ‘పోవోయ్.. బోడి నువ్వు చెప్పేది ఏమిటి ?’ అని పాఠకుడు నమ్మనంతగా ఆ కథలు జీవనానుభావాలుగా మిగిలిపోతాయి. ఈ రెండో కోవకు చెంది న కథలే జయమోహన్ కథలు.

ఇందులో ధర్మమే ఉంటుంది. ధర్మపరులైన నీతిమంతులైన మనుషులే ఉంటారు. కానీ ఈ కథ లను జయమోహన్ సృష్టించాడు అనడం కంటే, ఈ కథలే తమంతట తాము ఇంత బలంగా బయటకు రావడానికి ఒక జయమోహన్ సృష్టించుకున్నాయి అనుకోవాలి.

‘అరం’ కథ చదివితే..

‘అరం’ కథ చదివినప్పుడు నాకు ‘ఫిరదౌసి’ కథ గుర్తుకొచ్చింది. బంగారు నాణేల బదులు వెండి నాణేలు ఇచ్చిన మహమ్మద్‌ను శపిస్తూ మసీదు మీద పద్యాలు రాసి వెళ్లిపోతాడా కవి. పైకి చూస్తే అంతే కదా, ఈ కథలో ఏముంది అని అనిపించవచ్చు. ఈ కాలంలో పద్యాలు రాసి శాపనార్థాలు పెడితే కరిగిపోయేవాడు ఎవడున్నాడు అని కొట్టిపడేయవచ్చు.

కానీ, ఎందుకో కథ చదివాక ఈ కాలంలో మాత్రం ఒక కవికి అలాంటి అనుభవం ఎందుకు జరిగి ఉండకూడదు? ధర్మానికి ఈ కాలంలో మాత్రం ఒకరు ఎందుకు భయపడి కవిని ఆదరించకూడదు? ఇలాంటి ప్రశ్నలు రావ చ్చు గాని, ఈ తర్క వితర్కాలు ఏమీ జరగకుండానే, అసలు ధర్మం అనేది ఉందా? లేదా? అన్న ఆలోచన లేకుండానే.. ఈ కథలోని కవిని మనలోని కవిని పక్క పక్కన కూర్చోబెట్టి అలా కాసేపు చూస్తూ ఉండిపోతాం.

ఏదో ధర్మోద్ధరణ కోసం ఈ కథ రాసినట్టు అనిపించలేదు. ధర్మమే తనను తాను ఉద్ధరించుకోవడానికి ఈ కాలంలో ఈ కథను, ఈ రచయితను ఆలంబన చేసుకుని ఇదిగో ఇలా బయటకు వచ్చింది. ఒక అనుభవాన్ని మన ముందు పరిచాడు అంతే అనిపిస్తుంది అదే గొప్ప కథలోని బలం. 

కళ్లముందే కథా దృశ్యాలు..

‘ఒగ్గని వాడు’ కథ చదివాక శరీరం పటపటా పగిలిపోతున్నట్టు ఆత్మ ఫెళ.. ఫెళా విరిగిపోతున్నట్టు.. పగిలిన విరిగిన దేహాత్మల నుంచి ఏనుగుల సమూహాలు సమూహాలుగా బయటకు వచ్చినట్టు.. వాటి మీద ఈ దేశంలోని దళిత సోదరులు ఏనుగు అంబారి ఎక్కినట్టు, ఎక్కి మీసం తిప్పుతూ ఊరేగుతూ కాళ్లు పైకెత్తి కోటలన్నీ కూల్చబోతున్నారా..? అన్న దృశ్యం కళ్ళ ముందు కదులుతుంది.

ఇది దళిత కథ ఆధునిక రూపం. ఇది కష్టాలు కన్నీళ్లు అణచివేతలు నివేదనలు దాటుకొని దళితాత్మ గౌరవం ఇలా ఏనుగెక్కి ఆకాశాన్ని ఒక్క తన్ను తన్ని, సకల గోళాలను పగులగొట్టి ఘీంకరించిన అతి భయానక స్వప్నంలోకి మనల్ని తీసుకుపోయే కథ. ఇది కూడా ఎక్కడా కల్పించినట్టు అనిపించదు. అది ఒకరి అనుభవం అంతే. ఒకరి అనుభవం దేశం అనుభవంగా మార్చిన తీరు అద్భు తం.

ఈ కథలు చదివాక రచయితకు కాదు కథల్లోని ప్రముఖ పాత్రధారుల పాదాలకు సాష్టాంగ పడి దండాలు పెడతాం. ఏనుగు డాక్టర్ గురించి చదివాక ‘ఇదిగో అడవిని కాపాడండి, అడవి ప్రాణుల్ని రక్షించండి, అడవినిన ధ్వంసం చేయకండి’ అని నీతిని చెప్పడానికి ఈ కథను రచయిత రాశాడు అనిపించదు. అసలు ఏనుగు డాక్టర్ లాం టి వాళ్లు ఉంటారా? అన్న మీమాంస కూడా కలగదు. 

అడవిలో అడవి అంతటి హృదయం ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు. అతని గురించి తెలుసుకుంటాం. అడవి అణువంతటి పురుగుల నుంచి ఏనుగంతటి వన్య మృగాల దాకా, అన్నింటినీ ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రేమను అతను ఏ అవార్డుతోనూ వెలకట్టలేదు. అలాంటివాడు ఉన్నాడంతే. అతని గురిం చి చదువుకుని అలా ఉండిపోతాం. మరి ఈ అనుభవాలు చదువుతున్నప్పుడు కేవ లం అలాంటి వాళ్లు ఉన్నారు..

అని తెలుసుకునే ఆగిపోతామా? లేదు. అది ఎవరి హృదయం మీద ఏ విధమైన ముద్ర వేస్తుందో.. ఎలాంటి ప్రభావం చూపిస్తుం దో చెప్పలేం. సాహిత్యం చేసే మాయ అదే. సాహిత్యానికి, సమాజానికి ఉన్న సంబం ధం అంటే ఏనుగు డాక్టర్‌కి అడవి జంతువులకి ఉన్న సంబంధం. దానికి ఎలాంటి పురస్కారాలూ సన్మానాలూ అవసరం లేదు. 

సందేశం కోసం కాదు..

‘కూటి రుణం’ కథ కూడా అంతే అత ను అన్నం పెట్టిన చేతుల రుణాన్ని ఎలా తీర్చుకున్నాడో చదివాం కదా. ఓహో మనుషుల్లారా తిన్నింటి వాసాలు లెక్కపెట్టకుండా అన్ని రుణాలూ తీర్చుకోవాలిరా అని ఏదో తీర్పు చెప్పడానికి ఈ కథ రాశాడా? అలా ఆరా తీయాలనిపించలేదు. ఇది జరిగింది అంతే. అతను అలా చేశాడు అంతే.

కెత్తేలు సాయిబు ఉన్నాడు అంతే. అమ్మ చేయి లాంటి అతని చేతి కూడు తిన్నందుకు జీవితాన్ని నోట్ల కట్టలా మూటగట్టి అతని హుండీలో ఆ వ్యక్తి వేశాడు. అంతే అలా జరిగింది. అంతే అం తటితో కథ ముగిసింది. చదివిన తర్వాత అందరిలో కొత్త కథలు మొదలవుతాయి. ప్రశ్నలతోనో పశ్చాత్తాపాలతోనో.. ఏవేవో కథలు మొదలవుతాయి. ‘ఓ మనిషి నువ్వు ఎందరికో రుణపడ్డావురా.. వారి రుణం తీర్చుకోరా!’ అని చెప్పడానికి ఈ రచయిత కథను ఇంత చక్కగా అల్లాడా అంటే లేదు.

అతను అలా ఆలోచించి ఈ కథ చెప్పలేదు. అతని అనుభవంలోంచి తోడి తీసి మన ముందు పోశాడు అంతే. సాక్షాత్తు రచయితే వచ్చి లేదు మీకు నేను ఈ సందేశం ఇవ్వడం కోసమే కథ రాశాను.. అంటే మళ్లీ అదే మాట.. ‘పోవోయ్.. నీ బోడి సందేశం’ ఎవరికి కావాలి అనేస్తాం. మచ్చుకు మాత్రమే రెండు మూడు కథలు చెప్పాను. మిగిలినవి మీరు చదివి ఇదే అనుభవాన్ని పొందుతారు. పొరుగు వాడి ప్రతిభను గుర్తించడం.. మన అసమర్థతను చాటుకోవడం కాదు.

సాహిత్యానికి ఏ రకమైన ఎల్లలూ లేవు. చదువుకోవడం.. తెలుసుకోవడం.. అనుభవించడం.. పలవరించడం అంతే. భుజాలు తడుము కోకూడదు. ఎక్కడో రష్యాలోనో, స్పానిష్ లోనో వచ్చిన రచనలను ఇప్పుడు అనువాదం చేసి మనం ఎందుకు చదువుకుం టున్నాం? మనం తక్కువ వాళ్లమని కాదు. ఇంకా ఎక్కువ వాళ్లమయ్యే క్రమం మాత్రమే ఇది. ఈ కథలను ‘ఛాయా పబ్లికేషన్స్’ తెలుగులో అవినేని భాస్కర్‌తో అనువాదం చేయించి ప్రచురించింది.

 (రచయిత జయమోహన్ 

‘నెమ్మినీలం’ కథల పుస్తకంపై 

రాసిన సమీక్ష.

ప్రసాదమూర్తి ఫేస్‌బుక్ వాల్ నుంచి)