calender_icon.png 14 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లుక్ ఏ బుక్.. ఫర్ ఏ ఛేంజ్!

14-07-2025 12:00:00 AM

హాథీరామ్ సభావట్ :

సమాజ గమనం మారుతున్నా కొద్దీ, మనుషుల అలవాట్లు, ఆచారాలు మారుతూ వస్తున్నాయి. అది ఎంతగా మారిందంటే మనిషి తనకు తాను కాకుండా పోయాడు. భావోద్వేగాలు లేని మరమనిషిలా మారాడు. విలువలు లేని జీవచ్ఛవంలా రూపాంతరం చెందాడు. చరిత్రను మరచిపోయి, అబద్ధాల ప్రచారంలో కూరుకుపోయాడు. ఇదీ ప్రస్తుత సమాజంలో ఒక సామాన్యుని దుస్థితి.

ఇక విద్యార్థుల విషయానికొస్తే ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టా గ్రాం,  ఎక్స్, యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. 24 గంటలూ మొబైల్ ఫోన్‌లోనే ‘తల’మునకలై ఉంటున్నారు. కనీసం.. వారికి ‘మనమేంటి.. మన గతమేంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం ? మన పూర్వీకులు ఎవరు? మన చరిత్ర ఏంటి’ అనే ప్రాథమిక అంశాలపై కూడా అవగాహన ఉండటం లేదు. 

వర్సిటీల్లో కొందరు విద్యార్థులు మొబైల్‌కు తమ జీవితాలను అంకితం చేసుకుం టున్నారు.వారిలో కొందరినైనా.. మళ్లీ పుస్తకాల వైపు మళ్లించాలనే ఆలోచన నాతో పాటు మా స్నేహితుల్లో కలిగింది. ‘పుస్తకం సత్యాన్ని నిలబెడుతుంది. సమస్త విశ్వ రహస్యాలను మన ముందుకు ఆవిష్కరిస్తుంది. మనిషి బానిస సంకెళ్లను తెంచుకుంది. అతడికి ఆత్మస్థుర్యైన్ని ఇస్తుంది’ అని నమ్మి స్నేహితులమంతా కలిసి ఒక ఆలోచన చేశాం.

అదే ‘లుక్ ఏ బుక్’ కాన్సెప్ట్. ‘ఫోన్లు వదలండి పుస్తకాలు పట్టండి’ అనేది ట్యాగ్‌లైన్. ఈ కాన్సెప్ట్‌ను నేనూ నా మిత్రులు వంశీకృష్ణ, అమర్‌నాథ్, శివ నాస్తిక్, జాహ్న వి, ఉదయ్‌కిరణ్ విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనుకున్నాం. ఏప్రిల్ 20న (ఆదివారం) కాక తీయ యూనివర్సిటీలోని ఖాళీ స్థలాల్లో కొన్ని పుస్తకాలను నేలపై పరిచాం. వర్సిటీ విద్యార్థులు కొందరు కాన్సెప్ట్ బాగుందని మా వద్దకు వచ్చారు.

తమకు నచ్చిన పుస్తకాలను చదువుకుని, కొంత సమయం పుస్త కాలతో గడిపి వెళ్లిపోయారు. అలా తొలిరోజు గడిచింది. గ్రంథాలయంలో చదువు కోవడం కంటే.. పచ్చని చెట్లు, మొక్కల మధ్య.. వర్సిటీ బెంచ్‌లపై కూర్చొని పుస్తక పఠనం చేయడం ఎంతో అనుభూతినిచ్చిందని కొందరు విద్యార్థులు చెప్పడం మాకు ఆనందాన్నిచ్చింది.

కాన్సెప్ట్‌ను యూనివర్సిటీల్లోనే ఎందుకు అమలు చేస్తున్నామంటే.. ఒకప్పుడు వర్సిటీలంటే, అక్కడ విద్యార్థులంటే చైతన్యానికి ప్రతీకలుగా ఉండేవారు. అప్పుడు పుస్తక పఠనం విరివిగా ఉండేది. అంతర్జాతీయ, దేశ, ప్రాంతీయ రాజకీయాలపై విద్యార్థులంతా బహాటంగా చర్చించేవారు. వారే బయటి సమాజాన్ని సైతం చైతన్యపరిచేవా రు. అనంతరం వారే చదువుపూర్తి చేసుకుని, విద్యావంతులుగా మారి సమాజంలో కి వచ్చేవారు. వారిలో కొందరు కవులు, కళాకారులుగా ఎదిగేవారు.

మరికొందరు రాజ కీయవేత్తలు, విద్యావేత్తలు కూడా అయ్యేవారు. తద్వారా వారు.. తమముందు తరాలనూ చైతన్యపథం వైపు నడిపించేవారు. కానీ, నేడు వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల తలలు వైఫై రూటర్లకు వేలాడుతున్నాయి. ఎంతసేపూ వారు మొబైల్స్ చూస్తూనే గడిపేస్తున్నారు. వీళ్లకు పుస్తకాలు దగ్గర చేయాలని మా బృందానికి అనిపించింది.

అలాగే మొదటి అడుగు వేశాం. వర్సిటీ విద్యార్థులు కొందరైనా పుస్తకాలకు అలవాటుపడితే, వారు బయటకు సమాజంలోకి వెళ్లి మరికొందరు పాఠకులను తయారు చేస్తారనేది మా నమ్మకం. అలాగే పుస్తకాలు చదివిన వారిలో కొందరైనా కవులు, రచయితలుగా ఎదుగుతారని మేం విశ్వసిస్తున్నాం. అందుకు ముందుగా మేం చదువుతున్న కాకతీయ యూనివర్సిటీనే ఎంచుకున్నాం. తర్వాత ఈ కాన్సెప్ట్ మా వర్సిటీతో పాటు తెలంగాణ, ఉస్మానియా వర్సిటీల్లోనూ అమలు చేస్తున్నాం. 

మేం అనుకున్న కాన్సెప్ట్‌ను వర్సిటీలో ప్రతి ఆదివారం అమలు చేస్తున్నాం. ‘వర్సి టీ ప్రాంగణంలో వారంలో ఒకరోజు మినీ గ్రంథాలయం’ అనే కాన్సెప్ట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. కొంద రు విద్యార్థులు వారంలో ఒకరోజు కాదు రెండుసార్లు అమలు చేయాలని కోరుతున్నారు. మా సంకల్పానికి ఎంతోమంది విద్యావేత్తలు, కవులు, కళాకారులు సహకరిస్తున్నారు.

వారి సహకారంతో ఇప్పటివర కు 500 పుస్తకాల వరకు సేకరించగలిగాం. కాకతీయ వర్సిటీలో వంశీకృష్ణ బృందం ప్రతి ఆదివారం ఈ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నది. అలాగే తెలంగాణ వర్సిటీలో దండు కొండల్ బృందం, ఉస్మానియా వర్సిటీలో హథీరామ్ బృందం నిర్వహిస్తున్నది. మున్ముందు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో అమలు చేయబోతున్నాం. వర్సిటీల్లో లుక్ ఏ బుక్ నిర్వహిస్తున్న సమయం లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

కొన్నివర్గాలు మా వద్దకు వచ్చి పుస్తకాలు తీసే యాలని చెప్పారు. అయినప్పటికీ మేం వెరవలేదు. మొదట మాతో విభేదించిన కొంద రు, ఆ తర్వాత మాకు మిత్రులై సహకరించి న వారు కూడా ఉన్నారు. మా బృందానికి ఏ సిద్ధాంతం లేదు. మా బృంద సభ్యులు ఏ సంఘాల్లోనూ సభ్యులు కారు. మేం స్వ తంత్రంగా ‘లుక్ ఏ బుక్’ను నిర్వహిస్తు న్నాం. మాకు ఎవరైనా సహకరించి మరికొన్ని పుస్తకాలు అందిస్తే మేం ధన్యులం.