16 May, 2026 | 2:38 AM

అన్నదాత ఆగమాగం!

16-05-2026 01:36 AM
  1. కొనుగోలు కేంద్రాల్లో నరకయాతన
  2. లారీలు రాక నిరీక్షణ 
  3. తేమ, తరుగు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ
  4. నిత్యం రోడ్డు ఎక్కుతున్న రైతన్నలు

కరీంనగర్, మే15(విజయక్రాంతి): ఆరుగాలం uశ్రమించి పంటలు పండించినా అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నెల రోజులు దాటినా.. తేమ వచ్చినా.. కొనే నాథుడు లేక ఆగమవుతున్నారు. క్వింటాల్కు ఏకంగా 7.5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తే అందినకాడికి తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ భగ్గుమంతున్నారు.. నాణ్యమైన వడ్లను ఏ కేటగిరీలో కాకుండా బీ కేటగిరీలో కొనుగోలు చేస్తూ క్వింటాల్కు రూ.20 తకువ చెల్లిస్తున్నా పట్టించుకునే వారు లేరని వాపోతిన్నారు. 

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యానికి ప్రధానంగా రవాణా వాహనాల కొరత, రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్లో ఆలస్యం, మరియు హమాలీల కొరత కారణమవుతున్నాయి. అకాల వర్షాల భయంతో కేంద్రాలకు ధాన్యం త్వరగా చేరుతుండగా, తూకం వేయడంలో జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో అన్లోడ్ చేసుకోవడం లేదు. దీనివల్ల లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.

కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలించడానికి సరిపడా లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో ధాన్యంలో తేమ శాతం తగ్గిపోవడం లేదా అకాల వర్షాలకు తడవడంతో, మిల్లర్లు తరుగు (కోతలు) పేరుతో ఎక్కువ ధాన్యం కట్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని కేంద్రాలలో హమాలీలు, తూకం వేసే సిబ్బంది సరిపోక తూకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.ఈ సమస్యలను నివారించడానికి అధికారులు కొనుగోలు కేంద్రాలను, మిల్లుల వద్ద అన్లోడింగ్ను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.

అర్ధరాత్రి తనిఖీలు

గంగాధర మార్కెట్ యార్డ్, మధురనగర్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో కలిసి పర్యవేక్షించారు. ధాన్యం కొనుగోళ్లు డెడ్లైన్ ప్రకారం కొనుగోలు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు రోజుల్లోగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా పెద్ద ఎత్తున లారీలను సమకూర్చి వెంట వెంటనే రవాణా చేపట్టాలని తెలిపారు. మిల్లుల వద్ద కూడా వేగంగా అన్లోడింగ్ జరిగేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.