భూమి ఇచ్చిన రైతుకు వాటా దక్కాల్సిందే
- రైతులకు మొండిచేయి.. సంస్థలకు నిరంతరం లాభాలు
- భూమి స్వాధీన చట్టాలు పరిహారాలు అంశంపై మౌనమే శాపం
- 60వేల ఉద్యోగాలని, 20వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తారా?
- దుప్పిటూరులో బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ నిర్వాసితుల ఆందోళనలో డాక్టర్ పూర్ణచందర్‌రావు
అనకాపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): భూమి ఇచ్చిన రైతులకు తాత్కాలిక పరిహారం మాత్రమే అందజేస్తున్నారని, కానీ భూమి మాత్రం శాశ్వతంగా పోతుందని, దాన్ని దక్కించుకున్న సంస్థలకు మాత్రం నిరంతరం లాభాలు చేకూరుతున్నాయని ఐపీఎస్ డాక్టర్ జె. పూర్ణచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఇచ్చిన రైతులకు వాటా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
భూమిపై ఇచ్చే నగదు పరిహారం రైతుల భవిష్యత్‌ను భద్రపర్చలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి స్వాధీన చట్టాలు, పరిహారాలు, లాభ భాగస్వామ్యం అంశంపై మౌనం పాటించడమే పెద్ద లోపమని పేర్కొన్నారు. గ్రామంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. పలు దారులను మూసివేస్తూ నిర్మాణాలను చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
దీంతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని దుప్పిటూరు గ్రామంలో ఆదివారం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ నిర్వాసితుల ఆందోళనలో పూర్ణచందర్‌రావు పాల్గొని ప్రసంగిం చారు. బ్రాండిక్స్ సంస్థకు భూమి ఇస్తే 60 వేల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి కేవలం 20వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, నిరుపయోగంగా ఉన్న 600 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి ఇచ్చిన వారందరికీ సంస్థ లాభాల్లో వాటా ఇవ్వాలన్నారు.
రైతులను భూమి నుంచి వేరుచేయడం అంటే అతని జీవనాధారాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. గ్రామాలు కష్టాల్లో ఉంటే, పరిశ్రమలు లాభా ల్లో ఉంటున్నాయని చెప్పారు. ఇలాంటి చర్య ల వల్ల రైతులు కూలీలుగా మారుతున్నారని, యువత వలస వెళుతోందని, మహిళలు అస్థిర ఉపాధిలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పరిశ్రమల లాభాల్లో రైతులకు వాటా ఇవ్వాలని, 25 నుంచి 30 సంవత్సరాల వార్షిక భృతి, సంస్థలో ఈక్విటీ భాగ స్వామ్యం కల్పించాలని పూర్ణచందర్‌రావు డిమాండ్ చేశారు.
అంతేగాక సంస్థ తీసుకున్న భూమి నిరూపయోగంగా ఉన్న 600 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి ఇచ్చిన బీసీ, ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందని గ్రామపెద్దలు ఆవేదన వ్యక్తంచేశారు. సరైన పునరావాసం లేదని, జీవనాధారానికి హామీ లేదని, ఇప్పుడు గ్రామానికి దారులను కూడా మూసివేస్తున్నారని, ఇది అభివృద్ధి కాదు, వినాశమని మండిపడ్డారు. దుప్పిటూరు బీసీ ఎస్సీ నిర్వాసితుల పోరాటం కొనసాగుతుందని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎల్ రాజారావు, అడ్వకేట్ బీ వరంజిత్ తదితరులు పాల్గొన్నారు.






