calender_icon.png 19 December, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన విగ్రహాన్ని తానే ఏర్పాటు చేసుకున్న రైతు బిడ్డ

19-12-2025 01:29:21 AM

89 ఏళ్ల వయసులోనూ వ్యవసాయంపై అపార మమకారం  కళ్లెం నర్సింహారెడ్డి

మొయినాబాద్, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): 89 ఏళ్ల వయసులోనూ వ్యవసాయంపై అపారమైన మమకారంతో జీవితం సాగిస్తున్న అరుదైన రైతు కళ్లెం నర్సింహా రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ పల్లె నుంచి అమెరికా వరకు తన వ్యవసాయ ప్రతిభతో గుర్తింపు పొందిన ఆయన, తాజాగా తన భార్యతో పాటు తన విగ్రహాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా మారారు.

మూడుదశాబ్దాల పాటు అమెరికాలో నివసించిన కళ్లెం నర్సింహా రెడ్డి అక్కడ కూడా వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని, ఐదువేల ఎకరాల భూమిని లీజుకు తీసుకుని వివిధ రకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. ఈ కృషికి గుర్తింపుగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును కూడా అందుకున్నారు. తర్వాత మాతృభూమిపై మమకారంతో తెలంగాణకు తిరిగివచ్చిన ఆయన, చిలుకూరు సమీపంలో తన పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఆధునిక సాగు పద్ధతులతో పాటు ప్రకృతితో మమేకమై జీవితం గడుపుతున్న నర్సింహా రెడ్డి, ఈ వయసులోనూ వ్యవసాయ పనులన్నీ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో భార్య కళ్లెం లక్ష్మి విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

భార్యపై ఉన్న ప్రేమతో రాజస్థాన్లో విగ్రహాలను తయారు చేయించుకున్న ఆయన, ఆమె ఒంటరిగా నిలవకూడదనే భావనతో తన విగ్రహాన్ని కూడా పక్కనే ఏర్పాటు చేశారు. ఈ రెండు విగ్రహాలను కళ్లెం నర్సింహా రెడ్డి స్వయంగా ఆవిష్కరించనుండడం విశేషంగా నిలుస్తోంది.